కమిషన్‌ లేవనెత్తిన అంశాలకు కేసీఆర్‌ వివరణివ్వాలి

To the points raised by the Commission KCR should explain – సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్తు కొనుగోళ్ళపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారనీ, విచారణ పూర్తికాకుండానే కమిషన్‌ మీడియా సమావేశంలో మాట్లాడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎదురుదాడికి దిగడం సహేతుకం కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ పారదర్శకంగా లేకపోవటంతో తాను కమిషన్‌ ముందు హాజరుకాననీ, కమిషన్‌ చైర్మెన్‌ స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్‌ చెప్పటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో జరిగిన విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను కేసీఆర్‌ సమర్ధించుకుంటున్నారని తెలిపారు. మార్కెట్‌లో తక్కువ రేటుకు విద్యుత్తు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకోవడంపై ఆనాడే విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని తెలిపారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై ఉన్నదని గుర్తు చేశారు. అవసరమైతే విచారణ చేసుకోండి అని గతంలో ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రభుత్వం కుట్రపూరితంగా విచారణ చేయిస్తున్నదని ఆరోపించడం అవకాశవాదమేని విమర్శించారు. కమిషన్‌ లేవనెత్తిన అన్ని అంశాలపై, ప్రజలలో నెలకొన్న అనుమానాలకు పూర్తి వివరణ ఇచ్చి కేసీఆర్‌ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని సూచించారు. అదే సందర్భంలో విచారణ పూర్తి కాకుండానే కమిషన్‌ మీడియా సమావేశం నిర్వహించటం కూడా సరైంది కాదని తెలిపారు.

Spread the love