కొత్త సచివాలయానికి కేసీఆర్‌

– పనుల పరిశీలన
– సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం
– అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్థూపం సందర్శన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పరిశీలించారు. శుక్రవారం తొలుత సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ చివరి దశకు చేరుకున్న ఎలివేషన్‌ పనులు, ఫౌంటేన్‌, గ్రీన్‌లాన్‌, టూంబ్‌ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్‌ డిజైన్‌ తదితర పనుల పురోగతిని తనిఖీ చేశారు. సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్‌ నుంచి ప్రత్యేకంగా వుడ్‌ కార్వింగ్‌ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సీఎం సంతప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సీిఎం చాంబర్‌ వుండే ఆరవ అంతస్తుకు చేరుకున్నారు. గత పర్యటన సందర్భంగా చేసిన సూచనల మేరకు వాల్‌ క్లాడింగ్‌, డెకరేషన్‌ తదితర తుదిమెరుగులనూ పరిశీలించారు. విశాలమై న కారిడార్లు, అంతే అందంగా తీర్చిదిద్దిన ఛాంబర్ల ద్వారాల పనితీరును పరిశీలించి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ.గణపతి రెడ్డి, అధికారులు, వర్క్‌ ఏజెన్సీని సీఎం అభినందించారు. సీఎం చాంబ ర్‌లోని సమావేశ మందిరాన్ని కూడా చూశారు. సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్లు, అందులో అమరుస్తున్న ఫర్నీచర్‌ను తిలకిం చారు. ఏర్పాట్లన్నీ సిబ్బంది పనికి అనుకూలంగా వుండే విధంగా వున్నా యా ? లేవా ? అని ఆరా తీసారు. నలుమూలలా కలియతిరిగిన సీఎం కేసీఆర్‌, ముఖ్యమంత్రి కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయా లనూ చూశారు. జీఏడి ప్రోటోకాల్‌ సిబ్బందికోసం ఏర్పాటు చేసిన చాంబ ర్లను, కలెక్టర్ల కాన్పరెన్స్‌ హాల్‌, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్‌ లాంజ్‌, విఐపీల వెయిటింగ్‌ లాంజ్‌లను చూశారు. మంత్రు లకు కేటాయిం చిన శాఖలు అన్నీ ఒక దగ్గరే ఉండేలా కార్యాలయాల కేటాయించాలని ఆదేశించారు. ఆయా శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూ లంగా కార్యాలయాలు ఉండాలని కేసీఆర్‌ అధికారులకు సూచించారు. అనంతరం గ్రౌండు ఫ్లోర్‌కు చేరుకున్న సీఎం, దక్షిణ భాగం గుండా నడుచు కుంటూ అక్కడ నిర్మాణంలో వున్న పార్కింగ్‌ తదితర పనులను పరిశీలిం చారు. అనంతరం సెక్రటేరియట్‌ చుట్టూ తిరిగి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు.
అంబేద్కర్‌ విగ్రహం…
సచివాలయం నుంచి నిర్మాణంలో వున్న డా.బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ పనుల పురోగతిని కూడా ఆయన చూశారు. అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సీఎం, అంబేద్కర్‌ విగ్రహం బేస్‌లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను, ఆడియో విజువల్‌ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటో రియం పనులు, బయట ఫౌంటేన్‌, లాండ్‌ స్కేపింగ్‌ తదితర పనుల పురో గతిని పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను, వర్క్‌ ఏజెన్సీలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని స్పష్టం చేశారు. చారిత్రకంగా నిర్మిత మవుతున్న డా. బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అమరవీరులస్థూపం…
అక్కడినుంచి తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం లేజర్‌ షో, ర్యాంప్‌, సెల్లార్‌ పార్కింగ్‌ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని మ్యాపుల ద్వారా సీఎంకు ఇంజినీర్లు వివరించారు. పనుల గురించి సంతప్తిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌ కొన్నిసూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో మంత్రి వేముల తోపాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు విప్‌ బాల్క సుమన్‌, ఎ. జీవన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి, కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మెన్‌ బండ శ్రీనివాస్‌, పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులున్నారు.

Spread the love