కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం

కేసీఆర్‌ను జైలుకు పంపిస్తాం– అవినీతిపై విచారణ చేసి తీరుతాం
– కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా
నవతెలంగాణ-ఆర్మూర్‌
‘త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది. పదేండ్ల్లలో రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్‌ ఒక్క పని చేయలేదు. కుమారుడు కేటీఆర్‌ కోసం లక్షల కోట్లు సంపాదించి పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చేసిన అక్రమాలు అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌లోని బైపాస్‌ రోడ్డు పక్కన శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధికి కంకణ బద్ధులై ఉంటామన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతుల ఆదాయం, ఎగుమతులను పెంచి నాణ్యమైన పసుపు సాగును ప్రోత్సహిస్తామన్నారు. గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేకంగా గల్ఫ్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీ సీఎంను చేస్తామని ప్రకటించారు. పరీక్ష పత్రాలను లీకేజీ చేసిన వారిని జైలుకు పంపుతామన్నారు. కేసీఆర్‌ డబ్బులు ఇచ్చిన వారికే మంత్రి పదవులు కట్టబెట్టాడని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కవిత మద్యం దందా నిర్వహించి కోట్లు సంపాదించారని చెప్పారు. ఈ సభలో ఆర్మూర్‌, బాల్కొండ నుంచి పోటీ చేస్తున్న పైడి రాకేష్‌రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అరవింద్‌, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య, నాయకులు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, లోక భూపతిరెడ్డి, పైడి రాకేష్‌ రెడ్డి సతీమణి రేవతి రెడ్డి, కుమార్తె సుచరిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love