గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ పనిచేశారు

– 200 యూనిట్లలోపు వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ – వీణవంక
సర్పంచుల పదవీకాలం ఈరోజు ముగియనుండడంతో గురువారం మండలంలోని దేశాయిపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భవన నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామల అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. గ్రామ అభివృద్ధి తోటే దేశ అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి కెసిఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసే సమయంలో వారిని గౌరవించాలని ఉద్దేశంతో వారి హయాంలోనే ప్రారంభోత్సవం చేసామన్నారు. నియోజకవర్గంలోని 106 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే వారెవరు బిల్లులు కట్టవద్దని అన్నారు. గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ బిల్లులో కట్టాల్సిన అవసరం లేదని చెప్పారని ఎవరైనా అధికారులు బిల్లుల కోసం వేధిస్తే ముఖ్యమంత్రి, మంత్రి వీడియో తో పాటు తన వీడియోను కూడా చూపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆరు గ్యారంటీల అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, జడ్పీటీసీ వనమాల, సాదవరెడ్డి, సర్పంచ్ జ్యోతి సురేందర్ రెడ్డి, పీఎస్ సిఎస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి లతో పాటు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love