– లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే బాబు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
– రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బహిరంగ ప్రకటనలు ఎలా చేస్తారు?
– దర్యాప్తులపై ప్రభావం పడదా?
– కల్తీ నెయ్యి వాడారనడానికి ఎలాంటి ఆధారాల్లేవు
– సీఎం, టీటీడీ సీఈవో ప్రకటనలకు పొంతన లేదు
– లక్షలాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం
– తదుపరి విచారణగురువారానికి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదంగా అందించే లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా చేసిన ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడంలోని ఔచిత్యాన్ని సుప్రీం ప్రశ్నించింది. కల్తీ నెయ్యి వాడినట్టు ల్యాబ్ నివేదిక ప్రాథమికంగా చూపలేదని ధర్మాసనం మౌఖికంగా గమనించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది.
తిరుపతి లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో లేదా విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు దుష్యంత్ శ్రీధర్, సుదర్శన్ న్యూస్ యాంకర్ సురేష్ చవాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈ వివాదంపై సీబీఐ విచారణ అవసరమా? లేదా అనేదానిపై కేంద్రం నుంచి సూచనలు కోరాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. అనంతరం కేసును గురువారానికి వాయిదా వేసింది.
కల్తీ జరిగిందనే వాదనకు ఎటువంటి ఆధారం లేదు
ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించినప్పుడు ఈ అంశంపై బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ జరిగిందనే వాదనను ధ్రువీకరించడానికి ఎటువంటి ఆధారం లేదని పేర్కొంది. లడ్డూలను తయారు చేయడానికి జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు కచ్చితంగా నిర్ధారించడానికి సీఎం వద్ద ఏవైనా ఆధారాలున్నాయా? అని జస్టిస్ గవారు ప్రశ్నించారు. రిపోర్టు ప్రకారం నెయ్యి నమూనాలు తిరస్కరించబడ్డాయని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. మీరు విచారణకు ఆదేశించినప్పుడు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్‌కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తరువాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్టు ఆధారాలు లేవు. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. బహిరంగంగా మాట్లాడే ముందు వాటిని పరీక్షించడం అవసరం కాదా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రకటనలు చేయొద్దు
లడ్డూల తయారీ ప్రక్రియలో కల్తీ నెయ్యిని ఉపయోగించినట్టు చూపించడానికి ప్రాథమిక ఆధారాలు లేవని సుప్రీం పేర్కొంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సింది కాదని, విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు అటువంటి ప్రకటనలు చేసినప్పుడు, అది సిట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అని ప్రశ్నించింది. గంటపాటు సుదీర్ఘంగా విచారణ జరిగిన అనంతరం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ”ఈ పిటిషన్ మొత్తం ప్రపంచంలో నివసించే కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసే మనోభావాలకు సంబంధించినది. గత పాలనలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించారని రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) ఏర్పాటుకు ముందే ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. అయితే విచారణకు ఆదేశించినప్పుడు ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు ప్రజల ముందు మాట్లాడటం సముచితం కాదని ప్రాథమికంగా భావిస్తున్నాం. అయితే టీటీడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కూడా ఇలాంటి కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని ఒక ప్రకటన చేసినట్టు కొన్ని పత్రికా నివేదికలు కూడా చెబుతున్నాయి. ఈ విషయంలో సీఎంతో టీటీడీ సీఈవో విభేదించారు. ఇద్దరి ప్రకటనలకు పొంతన లేదు. టీటీడీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కల్తీ నెయ్యి అంశంపై ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. నెయ్యి వాడినట్లు చూపించడానికి ఏమీ లేదు” అని సుప్రీం పేర్కొంది.
అయితే సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ టీటీడీ సీఈవో కొన్ని ట్యాంకర్లకు సంబంధించి ఆ ప్రకటన చేశారని అన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం ”మీరు మీ వైఖరిని ఉంచే ముందు సూచనలు తీసుకోండి. కల్తీ నెయ్యి ఉపయోగించారని చెప్పడానికి ఏమీ లేదు. అది మీ స్వంత వైఖరి కాదు. ఈ రోజు మీ వద్ద సమాధానం లేదు. బహిరంగ ప్రకటనలకు అసలు ఆధారమే లేదు” అని పేర్కొంది. ఫిర్యాదులు ఉన్నట్లయితే, ప్రతి ట్యాంకర్ నుంచి నమూనాలు తీసుకోవాల్సి ఉంటుందని, కొన్నింటి నమూనాలు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జూన్‌లో నెయ్యిని టీటీడీకి సరఫరాదారుడు పంపారని, జూలై 4 వరకు అదే సరఫరాదారుడు ఎన్‌డీడీబీకి నమూనాలు పంపలేదని ఆయన అన్నారు. అయితే జులై 6, 12 తేదీల్లో సరఫరా చేసిన ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి మాత్రమే ఎన్‌డీడీబీకి పంపామని తెలిపారు. జూలై 6 సరఫరా చేసిన రెండు ట్యాంకర్లలోనూ, జూలై 12న రెండు ట్యాంకర్లలోనూ నమూనాలను తీసుకున్నారని అన్నారు. అది కల్తీ నెయ్యి అని తేలిందని, జూలై 6, జూలై 12 తేదీల్లో సరఫరా చేసిన ట్యాంకర్లకు సంబంధించి టీటీడీ సీఈవో సీఈవో చేసిన ప్రకటన అని అన్నారు.
సుబ్రమణ్యస్వామి తరపు సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపిస్తూ తాను కూడా ఒక భక్తుడినేని, ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. కల్తీ నెయ్యికి సంబంధించి చేసిన ప్రకటన చాలా చిక్కులు కలిగి ఉందని, అనేక ఇతర సమస్యలను లేవనెత్తుతుందని పేర్కొన్నారు. మత సామరస్యానికి భంగం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాతిపదికన అలాంటి ప్రకటన చేశారనే దానిపై ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తి బహిరంగ ప్రకటన చేసినప్పుడు ఆధారాలు ఉండాలని, రాజకీయ జోక్యాన్ని అనుమతి స్తారా? అని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ వ్యతిరేకించారు. ఈ పిటిషన్లు విశ్వసనీయమైనవి కావని, ప్రస్తుత ప్రభుత్వంపై దాడి చేయడానికి మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించిందని తెలిపారు.
రిపోర్టుపై రెండో అభిప్రాయం తీసుకోవాలి
ఎస్‌జి తుషార్ మెహతా జోక్యం చేసుకుని ఇది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎవరు బాధ్యులు, ఏ ఉద్దేశంతో చేశారో దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ”ల్యాబ్ రిపోర్టులో కొన్ని అంశాలు అనుమతిం చినట్లుగా లేవు. రిపోర్టు స్పష్టంగా లేదు. మీకు జులైలో నివేదిక వచ్చింది. సెప్టెంబర్ 18న బహిరంగంగా మాట్లాడారు. మీకు కచ్చితంగా తెలియకపోతే, మీరు ఎందుకు బహిరంగంగా మాట్లాడారు?” అని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. లడ్డూల తయారీలో ఆ నెయ్యి వాడారా? అని జస్టిస్ గవారు ప్రశ్నించారు. దీనికి స్పందించిన టీటీడీ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇలాంటి నివేదిక వచ్చినప్పుడు , రెండో అభిప్రాయం తీసుకోవాలనే వివేకం లేదా? ఇందులో మొదటిది, ఈ నెయ్యి ఉపయోగించినట్లు రుజువు కాలేదు. రెండోది రెండో అభిప్రాయం తీసుకోలేదు” అని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. దీని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించాలా? లేదా దర్యాప్తును వేరే ఏజెన్సీకి బదిలీ చేయాలా? అనేది తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది.