జయ జయహే తెలంగాణ పాట కీరవాణి సంగీతం..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎంఎం కీరవాణి. సినీ సంగీత ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్‌తో తెలుగు సినిమా సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును అందుకున్న తొలి తెలుగు సంగీత దర్శకుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కీరవాణి కలిశారు. గీత రచయిత అందెశ్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్.. తదితరులు ఆయనతో పాటు రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటైంది. అందెశ్రీ రాసిన గీతం ఇది. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగుతుంది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసేలా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపేలా అందెశ్రీ రాశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాదిమంది నోట్లో నానిందీ పాట. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతాన్ని ఇదివరకే రాష్ట్ర గేయంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర వేడుకలు, తెలంగాణ లిబరేషన్ డే సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జాతీయ గీతంతో పాటు ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను కీరవాణికి అప్పగించారు రేవంత్ రెడ్డి. దీనిపై తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన జీవో ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అవకాశం ఉంది. కీరవాణి బ్రాండ్ కనిపించేలా, నాటు నాటు పాటకు మించిన స్థాయిలో ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ ఉండబోతోంది.

Spread the love