మా పథకాలనే కాపీ కొడుతున్నారు..ఉచిత విద్య తప్ప : కేజ్రీవాల్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఆరోపించారు. వీటిలో ఉచిత విద్యుత్‌ హామీని మాత్రమే అమలు చేస్తున్నారని, ఉచిత విద్య గురించి ఏ ఒక్క పార్టీ కూడా హామీ ఇవ్వడంలేదని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి విమర్శలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ మరో 15 ఏళ్లపాటు జీవించి ఉంటే దేశంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంతో మెరుగుపరిచేవారు. ప్రస్తుతం ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య ప్రాధాన్యతను గుర్తించడంలేదు. కొన్ని పార్టీలు ఆప్‌ హామీలను కాపీ కొట్టి.. పథకాలను అమలు చేస్తున్నాయి. కానీ, ఉచిత విద్య గురించి మాత్రం మాట్లాడటంలేదు. ఉచిత విద్య హామీ ఆప్ మాత్రమే ఇవ్వగలదు. విద్యారంగ అభివృద్ధికి ఆప్ ఎంతో కృషి చేసింది’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆప్‌ నుంచి అధికారాన్ని లాక్కునేందుకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కానీ, ప్రజలకు సేవ చేసేందుకే ఆప్‌ ఉందని, దేశాభివృద్ధి కోసం చేసే పోరాటంలో తమ విధానాలను వదులుకోలేమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Spread the love