దేశంలో బీజేపీ నియంతృత్వ పాలన: కేజ్రీవాల్

 

నవతెలంగాణ – ఢిల్లీ: అమృత్‌సర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న కేజ్రీవాల్ బీజేపీ పాలనపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.  పంజాబ్‌ ఆప్‌ కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో సహా పార్టీ నాయకులను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ప్రత్యర్థి పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టారని కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన ఆమోదయోగ్యం కాదన్నారు. గత 75 ఏళ్లలో దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆప్‌ విజయం సాధించేందుకు శాయశక్తులా కృషి చేయాలని కోరారు. ప్రత్యర్థులను ఇలా జైల్లో పెడుతుండటం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. భారత్‌ పరిస్థితిని రష్యాతో పోలుస్తూ మాట్లాడారు. ‘‘రష్యాలో పుతిన్‌ తన ప్రత్యర్థి నాయకులందరినీ జైలుకు పంపడమో లేదా వారిని చంపడమో చేశారు. ఆపై ఎన్నికలు నిర్వహించి 87 శాతం ఓట్లు సాధించారు. ప్రతిపక్షమే లేనప్పుడు మీకు మాత్రమే ఓట్లు వస్తాయి’’ అని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘నన్ను జైల్లో పెట్టారు, మనీష్‌ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం)ను జైలుకు పంపారు. కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతా అటాచ్‌ చేశారు. టీఎంసీను ఇబ్బందిపెడుతున్నారు. తమిళనాడులో స్టాలిన్‌ మంత్రులను జైలుకు పంపారు. అందరినీ జైల్లో పెట్టండి. అప్పుడు ఒకే పార్టీ, ఒకే నాయకుడు మిగిలిపోతారు. కానీ ప్రజాస్వామ్యం మనుగడే ఉండదు. ఇలా జరగనివ్వకూడదు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

Spread the love