కేజ్రీవాల్‌ రాజీనామా?

Kejriwal's resignation?– రెండు రోజుల్లో సీఎం పదవి వదిలేస్తా: ఢిల్లీ ముఖ్యమంత్రి
– పబ్లిసిటీ స్టంట్‌ : బీజేపీ, కాంగ్రెస్‌
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు, నిజాయితీ పరుడినని ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చేవరకూ సీఎం పగ్గాలు చేపట్టబోనని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆరు నెలల తర్వాత శుక్రవారం ఆయన తీహార్‌ జైలు నుంచి విడుద లయ్యారు. ఆదివారం ఢిల్లీలోని ఆప్‌ కార్యాల యంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవం తుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతానని తెలిపారు. ఆప్‌ నాయకులు సత్యేందర్‌ జైన్‌, అమానతుల్లా ఖాన్‌ ఇంకా జైల్లోనే ఉన్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి, నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు, ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చేవరకూ అధికార పగ్గాలు చేపట్టబోనని ప్రతినబూనారు. కేజ్రీవాల్‌ అమాయాకుడా..? దోషా..? అని తాను ఢిల్లీ ప్రజలను అడగ దలుచుకున్నానన్నారు. ఢిల్లీ నూతన ముఖ్య మంత్రిని ఎన్నుకునేందుకు ఆప్‌ ఎమ్మెల్యేలతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మహారాష్ట్రతో పాటు ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.
కేజ్రీవాల్‌ రాజీనామాపై పార్టీ సీనియర్‌ నేత రాఘవ్‌ చద్దా స్పందించారు. కేజ్రీవాల్‌ తన పదవిని త్యజించి అగ్నిపరీక్షకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. ఆప్‌కు ఓటు వేయడంతో కేజ్రీవాల్‌ నిజాయితీపరుడని ఢిల్లీ ప్రజలు నిర్ధారించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ దీవార్‌ మూవీలోని సన్నివేశాన్ని తలపిస్తూ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ అమాయకుడని తమ చేతిపై రాసుకోవాలని చద్దా కోరారు.
కేజ్రీవాల్‌ ప్రకటన ఓ పబ్లిషింగ్‌ స్టంట్‌, ఎన్నికల ఎత్తుగడ : విమర్శించిన బీజేపీ, కాంగ్రెస్‌
కేజ్రీవాల్‌ ప్రకటన పబ్లిసిటీ స్టంట్‌, ఎన్నికల ఎత్తుగడ మాత్రమేనని కాంగ్రెస్‌, బీజేపీలు తప్పుపట్టాయి. తన ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భాగమేనని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్‌ భండారి విమర్శించారు. ఢిల్లీ వాసుల్లో కేజ్రీవాల్‌ అవినీతిపరుడనే ముద్ర పడుతోందని గ్రహించినందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌ పదవి నుంచి తప్పుకోవడం త్యాగమేమీ కాదని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అధికారుల అనుమతి లేకుండా సీఎం కార్యాలయంలోకి ప్రవేశించడం, ఫైళ్లపై సంతకాలు చేయడం కుదరని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత మణిందర్‌ సింగ్‌ సిర్సా పేర్కొన్నారు. తదుపరి సీఎంగా భార్య సునీతా కేజ్రీవాల్‌ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను ఒప్పించేందుకే రెండు రోజుల గడవుతు తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇక సీఎం నిర్ణయం కేవలం ప్రచార ఎత్తుగడేనని కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ అభివర్ణించారు. ఆయన ఎప్పుడో రాజీనామా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, బెయిల్‌పై విడుదలైన తర్వాత సీఎం కార్యాలయంలోకి వెళ్లకుండా ఆపడమే కాక, ఫైళ్లపై సంతకాలు కూడా చేయకూడదని సుప్రీంకోర్టు కోరడం ఇదే తొలిసారని గుర్తుచేశారు. ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో కోర్టు ఆందోళన ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోందన్నారు. కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు నేరస్తుడిగా పరిగణిస్తున్నదని ఆరోపించారు.

Spread the love