కేజ్రీవాల్‌ను బేషరతుగా విడుదల చేయాలి

కేజ్రీవాల్‌ను బేషరతుగా విడుదల చేయాలి– ఆప్‌ సామూహిక నిరాహారదీక్ష
– కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్‌ఎస్పీ మద్దతు
నవతెలంగాణ బ్యూరో ముషీరాబాద్‌ – హైదరాబాద్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను బేషరతుగా విడుదల చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్‌ఎస్పీ పార్టీలు మద్ధతు తెలిపాయి. కేజ్రీవాల్‌ అరెస్టు కేవలం ప్రతిపక్షాల ప్రశ్నించే గొంతులను అణచివేయడం లో భాగమేనని ఆయా పార్టీల నేతలు విమర్శించారు.మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను ఏదో ఒక విధంగా లొంగదీసుకో వాలని బీజేపీ మొదట్నుంచి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. వివిధ రూపాల్లో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నదని తెలిపారు. అయినప్పటికీ ఆప్‌ రోజు రోజుకు బలపడుతుండటంతో ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో అరెస్టు చేశారని చెప్పారు. మోడీ విధానాలను వ్యతిరేకి ంచే కేజ్రీవాల్‌ డబ్బుల కోసం కక్కుర్తి పడే ప్రసక్తే లేదన్నారు. ఇండియా కూటమి ఏర్పాటు, నాలుగైదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపించగల సత్తా ఆప్‌కు ఉండటంతో కేజ్రీవాల్‌ను జైలుకు పంపించారన్నారు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలుగా, ఆదానీ, అంబానీలు ఏటీఎంలుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి, జీఎస్టీతో సామాన్యులు, మధ్య తరగతిని దోచుకున్న మోడీ మనిషేనా? అని ప్రశ్నించారు. ప్రధానికి ఉండాల్సిన అర్హతలు మోడీకి లేవని విమర్శించారు. ప్రజలను మోసగించి మరోసారి అధికారంలోకి రావాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం ఒక్కటిగా కదులుదామని తెలిపారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను నేరుగా ఎదుర్కోలేక ఈడీ, సీబీఐలను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టు చేశారని విమర్శించారు. బీజేపీ అవినీతికర ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం బయటికి రావడంతో దానిపై చర్చను దారి మళ్లించేందుకే ఈ చర్య చేపట్టారని తెలిపారు. పదేండ్లుగా చేసిన అభివృద్ధి ఏమి లేకనే భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని మోడీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేశ్‌ మాట్లాడుతూ మతోన్మాద వ్యతిరేక పోరాటంలో అందరం భాగస్వా ములవుదామని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ 400 సీట్లు తెచ్చుకు నేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని విమర్శి ంచారు. ఆర్‌ఎస్పీ తెలుగు రాష్ట్రాల కార్యద ర్శి జానకి రాములు మాట్లాడుతూ రామజ పం చేస్తున్న మోడీ మనువాద రాజ్యాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఇచ్చిన హామీల ను అమలు చేయకుండా ఎన్నికల వేళ చర్చను దారి మళ్లిస్తున్నారని తెలిపారు.
ఎదురొడ్డిన కేజ్రీవాల్‌కు భయపడ్డ మోడీ
మనవాద బీజేపీ భావజాలానికి ఎదురొడ్డి నిలబడ్డ కేజ్రీవాల్‌ ను చూసి ప్రధాని మోడీ భయపడి జైళ్లో వేశారని దిడ్డి సుధాకర్‌ విమర్శించారు. ఢిల్లీ మద్యం కేసులో నిందితులు శరత్‌ చంద్రారెడ్డి ఎనిమిది సార్లు తాను కేజ్రీవాల్‌ ను కలవలేదని చెప్పారని గుర్తుచేశారు. తొమ్మిదో సారి కేజ్రీవాల్‌ ను కలిశానని చెప్పిన ఆయనకు బెయిల్‌ మంజూరైందనీ, వెంటనే అతన్నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు వెళ్లాయని తెలిపారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
సీఎం విధులు నిర్వర్తిస్తే అరెస్టు చేస్తారా?
సీఎంగా విధులు నిర్వర్తించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ప్రముఖ న్యాయవాది, ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు సొలొమోన్‌ రాజు తప్పుపట్టారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ రూపొందించిన మద్యం విధానంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందని తెలిపారు. ఏ చట్టం కింద శరత్‌ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా అనుమతించారని ప్రశ్నించారు. ఈడీ దగ్గర కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. విధాన రూపకల్పనే నేరమైతే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈడీ అరెస్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎలక్టోరల్‌ బాండ్లు చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ప్రకటించిందనీ, అయినా కేసులెందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ ధర్నాలో ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు బుర్ర రాముగౌడ్‌, ఎం.ఏ.మాజీద్‌, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, నర్సింగ్‌ యమున గౌడ్‌, అధికార ప్రతినిధి జావేద్‌ షరీఫ్‌, వికలాంగుల విభాగం కన్వీనర్‌ దర్శనం రమేష్‌, యువజన విభాగం అధ్యక్షులు విజరు ముల్లంగి తదితరులు పాల్గొన్నారు.

Spread the love