న్యూఢిల్లీ: తాను చట్ట ప్రకారం నడుచుకుంటానని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లనుద్ధేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో గురువారం ఈడీ విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో గురువారం విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ తాను చట్టరీత్యా అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని చెప్పారు.