పవార్‌తో కేజ్రీవాల్‌

– కేంద్రం ‘ఢిల్లీ ఆర్డినెన్స్‌’పై చర్చ
– ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ మద్దతు తెలిపిన ఎన్సీపీ
ముంబయి : ఢిల్లీలో సర్వీసులను (అధికారుల పోస్టింగులు, బదిలీలు) తన నియంత్రణలో ఉంచుకునే విధంగా మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మద్దతను కూడగట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా పలు పార్టీల అధ్యక్షులను, నాయకులను కలుస్తున్న ఆయన రెండ్రోజుల పర్యటనలో భాగంగా ముంబయికి వచ్చారు. పర్యటనలో రెండో రోజు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ను కలిశారు. దక్షిణ ముంబయిలోని వై.బి చవాన్‌ సెంటర్‌లో వీరు సమావేశమయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద ఆర్డినెన్సుపై చర్చించారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌ వెంట పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నాయకులు సంజరు సింగ్‌, ఆ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా, ఆప్‌ ఇతర నాయకులు ఉన్నారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్‌, శరద్‌ పవార్‌లు మీడియాతో మాట్లాడారు. బీజేపీయేత పార్టీలు కలిసి వస్తే రాజ్యసభలో ఈ ఆర్డినెన్సును ఓడించొచ్చని కేజ్రీవాల్‌ అన్నారు. ఈ ఆర్డినెన్సు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముప్పు అని శరద్‌పవార్‌ అన్నారు.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా ముంబయికి వచ్చిన కేజ్రీవాల్‌ మొదటి రోజు(బుధవారం) మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్దవ్‌ థాక్రేను బాంద్రాలోని ఆయన ఇంటిలో కలిశారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కేంద్రంపై ఆప్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉద్దవ్‌ను కోరారు. తమ పార్టీ ఆప్‌ పోరాటానికి మద్దతిస్తుందని ఉద్ధవ్‌ తెలిపారు. అలాగే, ఈనెల 23న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిసిన కేజ్రీవాల్‌ ఆమె మద్దతను కూడగట్టారు. ఢిల్లీలో పోలీసు, శాంతి భద్రతలు మినహాయించి సర్వీసులు అక్కడ ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఈనెల 11న తీర్పునిచ్చింది. అంతకుముందు వరకు ఈ అధికారాలు అక్కడి(ఢిల్లీ) లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) చేతిలో ఉండేవి. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఢిల్లీలో గ్రూప్‌-ఏ అధికారులు, బదిలీలపై కేంద్రం అధికారం చలాయించే విధంగా ఈనెల 19న మోడీ సర్కారు ఒక ఆర్డినెన్సును తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Spread the love