నవతెలంగాణ-హైదరాబాద్ : మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న విచారించనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నెల రోజుల క్రితం అరెస్టు చేసింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. సీఎం అరెస్టును సమర్థించేందుకు ఈడీ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అరెస్టు విషయంలో దర్యాప్తు సంస్థను నిందించలేమని పేర్కొంది. మనీలాండరింగ్‌పై ఈడీ ఆధారాలు చూపించిందని, 2022 గోవా ఎన్నికలకు రూ.45 కోట్లు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని పేర్కొంది. తాజాగా కోర్టు ఆయనకు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు.