నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్‌మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. శీష్‌మహల్ పునరుద్ధరణకు పెట్టిన ఖర్చులపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) దర్యాప్తుకు ఆదేశించింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సిపిడబ్య్లుడి)ని సివిసి కోరింది. సిపిడబ్య్లుడి నివేదిక సమర్పించడంతో ఫిబ్రవరి 13న సివిసి విచారణకు ఆదేశించింది.
కాగా, ఢిల్లీ సిఎం అధికార నివాసాన్ని దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మత్తు చేపట్టినట్లు బిజెపి నేత విజేందర్ గుప్తా గతేడాది అక్టోబర్‌లో సివిసికి ఫిర్యాదుకు చేశారు. శీష్ మహల్‌ని ఆధునీకరించడంలో భాగంగా టాయిలెట్‌లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్‌పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించడంలో భారీగా అవకతవకలు జరిగాయని బిజెపి నేతలు విమర్శించారు. ఇక ఈ అంశాన్నే ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుని ఘన విజయం సాధించింది.