అమెరికా, క్యూబా పర్యటనలో కేరళ సీఎం

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అమెరికా, క్యూబాల్లో పర్యటించనున్నారు. ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా విజయన్‌ బృందం గురువారం ఉదయం బయలుదేరింది. ముందుగా జూన్‌ 9 శుక్రవారం విజయన్‌ న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను సందర్శించనున్నారు. అనంతరం న్యూయార్క్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. జూన్‌ 10న విజయన్‌ న్యూయార్క్‌ టైమ్‌స్క్వేర్‌లోని మారియట్‌ మార్కిస్‌లో ప్రాంతీయ సదస్సు లోక్‌ కేరళ సభను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ అసెంబ్లీ స్పీకర్‌ ఎఎన్‌.షంసీర్‌ అధ్యక్షత వహిస్తారు. ఆర్థిక మంత్రి కెఎన్‌. బాలగోపాల్‌, ప్రముఖ లోక్‌సభ సభ్యులు, చీఫ్‌ సెక్రటరీ విపి.జారుతో సహా పలువురు హాజరుకానున్నారు. జూన్‌ 11న బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌ను ప్రారంభిస్తారు. ఈ మీట్‌లో అమెరికాలోని మలయాళీ పెట్టుబడిదారులు, అమెరికాలో నివసిస్తున్న మలయాళీలతో పాటు ఐటీఐ నిపుణులు, విద్యార్థులు, మహిళా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. అదేరోజు సాయంత్రం టైమ్‌స్క్వేర్‌లో నిర్వహించే మలయాళీ కమ్యూనిటీ సమావేశంలో ప్రసంగించనున్నారు. జూన్‌ 12న వాషింగ్టన్‌ డీసీలో ప్రపంచబ్యాంక్‌ దక్షిణాసియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు మార్టిన్‌ రైజర్‌తో భేటీ కానున్నారు. జూన్‌ 13న సముద్రతీరంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పరిశీలించనున్నారు. జూన్‌ 14న న్యూయార్క్‌ నుంచి క్యూబా రాజధాని హవానాకు చేరుకుంటారు. 15,16 తేదీల్లో క్యూబాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Spread the love