వైద్యుల భద్రతకు కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్‌

తిరువనంతపురం : ఆస్పత్రుల్లో వైద్యుల భద్రతకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కేరళ ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో కేరళ హెల్త్‌ కేర్‌ సర్వీస్‌ వర్కర్స్‌, హెల్త్‌ కేర్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (హింస నివారణ, ఆస్తులకు నష్టం) ఆర్డినెన్స్‌ సవరణ, 2012ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం… ఆస్పత్రుల్లో హింసాత్మక చర్యలకు పాల్పడినా, ప్రయత్నించినా, ప్రేరేపించినా.. ఆ వ్యక్తికి కనీసం ఆరునెలలు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అలాగే రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తపైనకానీ, లేదా వైద్యునిపైన కానీ దాడికి పాల్పడితే కనీసం ఏడాది నుంచి ఏడేండ్ల పాటు జైలు శిక్ష విధించవచ్చు. రూ. లక్ష నుంచి అయిదు లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తాత్కాలికంగా నమోదైన వారితో పాటు మెడికల్‌ ప్రాక్టీషనర్లు, నర్సులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులు, పారామెడికల్‌ విద్యార్థులను కూడా ఈ సవరించిన ఆర్డినెన్స్‌లో చేర్చింది. గతవారం కొట్టారకర తాలూకా ఆస్పత్రిలో వైద్యురాలు వందనాదాస్‌ (23)ను ఓ రోగి కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌ ముసాయిదాను రూపొందించే బాధ్యతను ఆరోగ్య, హోం, న్యాయ విభాగాలు, ఆరోగ్య, సైన్స్‌ యూనివర్సిటీల ప్రతినిధులతో కూడిన కమిటీకి అప్పగించింది.

Spread the love