తిరువనంతపురం : నవ కేరళ శాస్త్ర, పరిశోధన, విజ్ఞాన రంగాల్లో ప్రగతిపథంలో పయనిస్తోంది. ఈ దిశగా రాష్ట్రంలోని ఎల్డిఎఫ్ కూటమి ప్రభుత్వం ప్రకటించిన పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ విజేతలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం నాడు ధ్రువపత్రాలు అందజేశారు. విజ్ఞానరంగ అభివృద్ధికి, పరిశోధన రంగంలో ప్రగతికి ఈ ఫెలోషిప్‌లు ఎంతగానో దోహందం చేస్తాయని ఈ సందర్భంగా విజయన్ అన్నారు. పరిశోధన రంగంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ తమ జోక్యాన్ని తగ్గించుకుంటున్న నేపథ్యంలో కేరళ పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తుండటం విశేషం. గత రాష్ట్ర బడ్జెట్లో పరిశోధన రంగానికి కేరళ ప్రభుత్వం ఏకంగా రూ.3500 కోట్లు కేటాయించింది. జాతీయ స్థాయి ప్రామాణికాలను పాటించి రాష్ట్రంలో ‘న్యూ కేరళ డాక్టోరల్ ఫెలోషిప్’ ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎంపికలో విజేతలుగా నిలిచిన పరిశోధన రంగ అభ్యర్థులందరినీ ముఖ్యమంత్రి విజయన్ అభినందించారు. ఫెలోషిప్‌కు అర్హులైన వారందరూ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని సిఎం ఆకాంక్షించారు.