కేరళ, తమిళనాడు పరస్పర సహకారం

Kerala and Tamil Nadu Mutual cooperation– కేరళ సీఎం పినరయి విజయన్‌
తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సహకార సమాఖ్య విధానానికి నిజమైన ఉదాహరణగా నిలుస్తున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. వైకోమ్‌ బీచ్‌లో గురువారం జరిగిన తంటై పెరియార్‌ మెమోరియల్‌, పెరియార్‌ లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకారం అనేది మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కొనసాగుతోందని అన్నారు. ఆర్థిక స్వయంప్రతిపత్తితో సహా రాష్ట్రాల హక్కులపై నిరంతరం ఆక్రమణలు జరుగుతున్న ఈ దశలో మిగతా రాష్ట్రాల మధ్య కూడా ఇలాంటి సహకారం విస్తరించాలని విజయన్‌ అన్నారు. వైకోమ్‌ సత్యాగ్రహంలో సరిహద్దులు దాటి సహజీవనం, సహకారాన్ని చూశాం. కేరళ, తమిళనాడులు ఆ సహజీవనాన్ని, సహకారాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు.
వైకోమ్‌ : వ్యక్తుల ఆత్మగౌరవం కోసం పెరియార్‌ నిలబడితే, రాష్ట్రాలు.. వారి ఆత్మగౌరవం కోసం నిలబడాలని కాలం కోరుతోంది. కాలం కోరుకునే విధంగా కేరళ, తమిళనాడులు పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకుపోతాయనడంలో సందేహం లేదు అని ఆయన అన్నారు. పెరియార్‌ స్మారక పునరుద్ధరణలో కూడా అదే స్పూర్తి ప్రస్పుటంగా కనిపిస్తుందని, రానున్న కాలంలో రెండు రాష్ట్రాలు మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
పెరియార్‌ అలియాస్‌ ఈవి రామస్వామి నాయక్కర్‌ భారతదేశమంతటా సంఘ సంస్కర్తలలో ముందంజలో ఉన్నారు. శ్రీ నారాయణుడిని కేరళీయులందరూ గురువుగా పిలుచుకున్నట్టే, ఈవీఆర్‌ని తమిళులందరూ గౌరవంగా పెరియార్‌ అని పిలుస్తారు. వైకోమ్‌ మహాదేవ దేవాలయం చుట్టుపక్కల ఉన్న మార్గాల్లో నడవడానికి అవార్ల హక్కు కోసం జరిగిన సత్యాగ్రహంలో పెరియార్‌ కీలకపాత్ర పోషించారు. పెరియార్‌, ఇతర నాయకులు ఉద్యమ స్వేచ్ఛను నిరాకరించడాన్ని మలయాళీలకే కాదు, దేశ ప్రజల సమస్యగా భావించారు. ఏప్రిల్‌ 13, 1924న పెరియార్‌ వైకోమ్‌ సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. దాంతో వైకోంలో జనసముద్రం పోటెత్తింది. ట్రావెన్‌కోర్‌ పరిపాలన సూచనల మేరకు అతన్ని అరెస్టు చేసి ఆరుకుట్టి జైలులో ఉంచారు. విషయం తెలిసిన వెంటనే భార్య నాగమ్మ వైకోంకు వచ్చింది. మహిళల భాగస్వామ్యంతో సత్యాగ్రహం ప్రాముఖ్యతపై పెద్దఎత్తున ప్రచారం చేశారు. స్త్రీల వివాహ వయస్సును పెంచడం, భర్తను ఎంపిక చేసుకునేందుకు, విడాకులు తీసుకోవడానికి అనుమతించడం వంటివి పెరియార్‌ జోక్యంతో సాధించిన చారిత్రాత్మక విజయాలు. పెరియార్‌ యొక్క అన్ని నిశ్చితార్థాలలో నాగమ్మ సమానంగా పాల్గొనేవారు. ఆరుకుట్టి జైలు నుంచి విడుదలైన పెరియార్‌ మళ్లీ సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొనడంతో ప్రభుత్వం ఆయనను బహిష్కరించింది. పెరియార్‌ ట్రావెన్‌కోర్‌ పాలకుల ఆజ్ఞను ఉల్లంఘించడంతో ఆయనను మళ్లీ జైలులో పెట్టారు. ఆ తర్వాత రాజు వర్ధంతి సందర్భంగా పెరియార్‌ ఇతర సత్యాగ్రహులు విడుదలయ్యారు. ఈ విధంగా వైకోమ్‌ సత్యాగ్రహానికి పెరియార్‌ నిస్వార్థ నాయకత్వాన్ని అందించారని విజయన్‌ వివరించారు.
పెరియార్‌ లైబ్రరీ జాతికి అంకితం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. స్టాలిన్‌ వైకోమ్‌ తంటై పెరియార్‌ మెమో రియల్‌. పెరియార్‌ లైబ్రరీని జాతికి అంకితం చేశారు. ఇరు రాష్ట్రాల మంత్రులతో సహా నాయకులు, సీనియర్‌ అధికారులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వైకోమ్‌ అవార్డు గ్రహీత కన్నడ రచయిత దేవనూర మహదేవన్‌ ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సత్కరించారు. ముఖ్య అతిథిగా ద్రవిడ కజక అధ్యక్షుడు కె.వీరమణి హాజర య్యారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మంత్రులు, నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, వైకోమ్‌ సత్యాగ్రహ నాయకుడు తంతై పెరియార్‌ జ్ఞాపకార్థం తమిళనాడు ప్రభుత్వం వైకోంలోని తంటై పెరియార్‌ మెమోరియల్‌ లైబ్రరీని స్థాపించింది. వైకోమ్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, గత ఏడాది వైకోమ్‌లో పర్యటించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, వైకోమ్‌ నగరంలోని తంతై పెరియార్‌ మెమోరియల్‌, లైబ్రరీ పునరుద్ధ రణకు రూ.8.14 కోట్లు మంజూరు చేశారు.

Spread the love