నవతెలంగాణ హైదరాబాద్: తన సేవలు ఎక్కడ అవసరమైతే పార్టీ అక్కడ ఉపయోగించుకుంటోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని అడిగే వ్యక్తిని నేను కాదని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చన్న ఈటల.. బండి సంజయ్ తన శక్తిమేరకు పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది ఢిల్లీ అధినాయకత్వం చూసుకుంటుంది. రానున్న ఎన్నికల్లో గెలవాలంటే మా శక్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ నాయకత్వంతో పాటు మేం కూడా ఇదే భావిస్తున్నాం. ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తల బలం పెంచుకోవడంతోపాటు ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు రావాలని కోరుకుంటున్నాం. పార్టీ బలోపేతం కోసం అందర్నీ భాగస్వామ్యం చేయాలి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న ఊహాగానాలు తప్పు. జాతీయ పార్టీలో ఢిల్లీ నేతలు ఇక్కడికి రావడం.. మేము ఢిల్లీ వెళ్లడం సహజం’’ అని ఈటల రాజేందర్ అన్నారు.