ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

బీసీ విద్యార్థులకు శుభవార్త
బీసీ విద్యార్థులకు శుభవార్త

నవతెలంగాణ హైదరాబాద్‌: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన బీసీ విద్యార్థుల పూర్తి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని.. ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీ విద్యార్థులకూ వర్తింపజేయనున్నట్టు తెలిపారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా అదనంగా రూ. 150 కోట్లను వెచ్చించనుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామన్నారు. దీంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజును చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి గంగుల వెల్లడించారు.

Spread the love