బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులో కీలక పరిణామం

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఈడీ అధికారులు బుధవారం తెరిచారు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామ పరిధిలో ఉన్న సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ క్వారీలో అక్రమాలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. జూన్‌ 20న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని దస్త్రాలు వెంట తీసుకెళ్లారు. ఎమ్మెల్యేను మంగళవారం హైదరాబాద్‌ కార్యాలయంలో ఈడీ అధికారులు విచారించారు. బుధవారం పటాన్‌చెరులోని యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్‌లకు మహిపాల్‌రెడ్డిని తీసుకెళ్లి లాకర్లు తెరిచి తనిఖీలు నిర్వహించారు. యాక్సిస్‌ బ్యాంక్‌ లాకర్‌ నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Spread the love