వివేకా హత్య కేసులో వెలుగులోకి కీలక సాక్ష్యాలు

– స్వీకరించిన సిబిఐ కోర్టు
హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక సాక్ష్యాలను సిబిఐ నమోదు చేసింది. కీలక వ్యక్తుల వాంగ్మూలాలను గత నెల 30న సిబిఐ కోర్టుకు సమర్పించింది. వీటిని కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో సిఎం జగన్‌ ఒఎస్‌డి పి.కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సిఎస్‌ అజేయ కల్లం, వైసిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ అటెండర్‌ గోపరాజు నవీన్‌కుమార్‌, వైఎస్‌ షర్మిల సాక్షులుగా ఉన్నట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉన్నట్లు సాక్షులు తెలిపారని పేర్కొంది. వైసిపి ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించేందుకు తెల్లవారుజామునే సమావేశమైనట్లు సిబిఐ కోర్టుకు నివేదించింది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలు ఈ కింద విధంగా ఉన్నాయి.
అవినాషే చెప్పారు : కృష్ణమోహన్‌రెడ్డి
2019 మార్చి 15 తెల్లవారుజామున లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశంలో ఉన్నప్పుడు ఆయన అటెండర్‌ నవీన్‌ వచ్చి ఎంపి అవినాష్‌ ఫోన్‌ లైన్‌లో ఉన్నారని, బయటకు రావాలని పిలిచారు. వివేకా మరణించారని అవినాష్‌ నాకు ఫోన్‌లో చెప్పారు. ఎలా జరిగిందని అవినాష్‌రెడ్డిని అడిగాను. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారని చెప్పారు. జగన్‌కు సమాచారం ఇవ్వండని అవినాష్‌ చెప్పారు. వివేకా మరణం విషయం, అవినాష్‌ చెప్పిన సమాచారం జగన్‌కు చెప్పాను. తర్వాత జగన్‌ పులివెందుల వెళ్లారు. జగన్‌ పర్యటన విషయం మాట్లాడేందుకు ఆ సమయంలో అవినాష్‌కు ఐదుసార్లు ఫోన్‌ చేశాను’
‘బాబాయ్ ఇక లేరు’ అని జగన్‌ చెప్పారు : అజేయ కల్లం
లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశంలో ఉండగా ఉదయం 5.30 గంటల సమయంలో అటెండర్‌ తలుపు కొట్టారు. వైఎస్‌ భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్‌ జగన్‌కు చెప్పారు. జగన్‌ బయటకు వెళ్లి పది నిమిషాల తర్వాత మళ్లీ వచ్చారు. బాబాయ్ ఇక లేరనే విషయాన్ని జగన్‌ నిలబడే మాకు చెప్పారు.
అవినాష్‌ ఫోన్‌ చేసి కృష్ణమోహన్‌కి ఫోన్‌ ఇవ్వమన్నారు : అటెండర్‌ నవీన్‌
ఆ రోజు ఉదయం 6.30 గంటలకు అవినాష్‌రెడ్డి ఫోన్‌ చేసి జగన్‌ ఉన్నారా? అని అడిగారు. కృష్ణమోహన్‌రెడ్డి, అజేయ కల్లం, ఉమ్మారెడ్డి తదితరులతో ్‌ సమావేశంలో ఉన్నారని చెప్పాను. కృష్ణమోహన్‌రెడ్డికి వెంటనే ఫోన్‌ ఇవ్వమని అవినాష్‌ చెప్పారు. సమావేశ గదికి వెళ్లి అవినాష్‌ లైన్‌లో ఉన్నారని కృష్ణమోహన్‌రెడ్డికి ఫోన్‌ ఇచ్చాను. అవినాష్‌, కృష్ణమోహన్‌రెడ్డి ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు.
ఆ విషయం జగన్‌కు ఎవరు చెప్పారో గుర్తులేదు : ఉమ్మారెడ్డి
‘సమావేశంలో ఉన్నప్పుడు ఎవరో యువకుడు వచ్చి వివేకా మరణించారని జగన్‌కు చెప్పారు. ఆయన ఎవరో నాకు గుర్తులేదు. కాసేపటికే సమావేశం ముగిసింది’
రాజకీయ కారణాలతోనే హత్య : వైఎస్‌ షర్మిల
రాజకీయ కారణాలతోనే బాబారు హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు. పెద్ద కారణం ఉంది. అవినాష్‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడడమే కారణం కావొచ్చు. వారికి అడ్డొస్తున్నారని మనసు లో పెట్టుకోవచ్చు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. కడప ఎంపిగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపిగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. అవినాష్‌కు టికెట్‌ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా నేను వెళ్లనని వివేకా ఆలోచిం చారు. కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారు. జగన్‌ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపిగా పోటీకి మొదట ఒప్పుకోలేదు. బాబారు పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నాను. ఎమ్మెల్సీగా బాబారు ఓటమికి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొందరు సన్నిహితులే కారణం. కుటుంబంలో అంతా బాగున్నట్లు బయటకు కనిపించినా, లోపల కోల్డ్‌వార్‌ ఉండేది.

Spread the love