శిరీష(బర్రెలక్క)కు భద్రతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థి కార్నె శిరీష (బర్రెలక్క)కు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని శుక్రవారం ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, ఆమె హాజరు అయ్యే పబ్లిక్‌ మీటింగ్‌లకు సెక్యూరిటీ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. గుర్తింపు ఉన్న పార్టీల అభ్యర్థులకు మాత్రమే భద్రత ఇస్తే సరిపోదు. తమకు ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాలి. అభ్యర్థుల బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. పోలీసులు కేవలం కార్లు చెక్‌ చేస్తాం అంటే కుదరదు అని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తనపై రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినందున 2ప్లస్‌2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కర్నె శిరీష (బర్రెలక్క) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కొల్లాపూర్‌ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఆమె తమ్ముడు తీవ్రంగా గాయపరిచారు.

Spread the love