కెనడాలో హిందూ ఆలయానికి వచ్చిన వారిపై ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల దాడి

– దాడిని ఖండించిన కెనడా ప్రధాని
– భారత్‌ వ్యతిరేక శక్తుల పనే ఇది : తీవ్రంగా స్పందించిన భారత హై కమిషన్‌
ఒట్టావా : కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయానికి వచ్చిన వారిపై ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఆదివారం దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలిస్తానీ జెండాను పట్టుకున్న వ్యక్తులు ఆలయానికి వచ్చిన వారిపై దాడి చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడే ఖండించారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌ వద్ద చోటు చేసుకున్న ఈ హింసాత్మక ఘర్షణలు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రతి వ్యక్తికీ తమ మత విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత్‌, కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం.టొరంటోకు వాయవ్యంగా 50 కి.మీ దూరంలో గల బ్రాంప్టన్‌లో ఆదివారం హిందూ సభా మందిర్‌లోని భక్తులపై కొందరు సిక్కు వేర్పాటువాదులు దాడి చేయడంతో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని పీల్‌ ప్రాంతీయ పోలీసు ప్రతినిధి పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనకు గల కారణాలను వారు వెల్లడించలేదు. ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని కెనడా ఆరోపించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
భారత్‌ వ్యతిరేక శక్తుల పనే ఇది
ఈ తరుణంలో జరిగిన ఈ దాడిపై భారత హై కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. భారత్‌ వ్యతిరేక శక్తుల పనే ఇదని వ్యాఖ్యానించింది.

Spread the love