రిపబ్లిక్‌ డే నాడు సీఎంను చంపేస్తాం: ఖలిస్థాన్‌ ఉగ్రవాది బెదిరింపులు

నవతెలంగాణ న్యూడిల్లీ: ఖలిస్థాన్‌ ఉగ్రవాది (Khalistani terrorist), నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ (Gurpatwant Singh Pannun) తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann)ను చంపేస్తామని హెచ్చరించాడు. జనవరి 26వ తేదీన భగవంత్‌ మాన్‌ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. గ్యాంగ్‌స్టర్‌లు అంతా ఏకమై రిపబ్లిక్‌ డే (Republic Day) రోజున పంజాబ్‌ సీఎంను చంపేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చాడు.
పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బెదిరింపులకు కారణంగా తెలుస్తోంది. ఈ బెదిరింపులపై పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ స్పందించారు. గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్‌ విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. పన్నూన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పన్నూన్‌ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటి సారి కాదు. గత కొన్ని రోజులుగా భారత్‌కు చెందిన పలువురు నేతలుచంపేస్తామంటూ, ప్రముఖ ఆలయాలు, ఎయిర్‌పోర్ట్‌లను ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులు చేశాడు. గత నెలలో కూడా పార్లమెంట్‌ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఇప్పుడు తాజాగా పంజాబ్‌ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

Spread the love