– కెనడా దౌత్యవేత్త బహిష్కరణ
– ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్ళాలని కేంద్రం ఆదేశం
– ముందుగా కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ : భారత్-కెనడా దేశాల మధ్య ఖలిస్థానీ చిచ్చు తీవ్ర ఉద్రిక్తమయ్యింది. ప్రముఖ ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపిస్తూ కెనడా ప్రభుత్వం భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అలాగే కెనడా చర్యకు ప్రతి చర్యగా ఆ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తను కేంద్రం బహిష్కరించింది. ఐదు రోజుల్లోగా దేశం విడిచివెళ్లాలని మంగళవారం ఆదేశించింది. ఖలిస్థానీ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిజ్జర్ హత్య గురించి సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో మాట్లాడుతూ ఈ హత్య వెనుక భారత దేశం ఉందని ఆరోపించారు. ఈ సంఘటను ఆమోదయోగ్యం కాని ఉల్లంఘనగా అభివర్ణించారు. అలాగే, కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్ ఎనాలసిస్ వింగ్ అధికారి పవన్ కుమార్ రారును దేశం నుంచి బహిష్కరించినట్టు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలి పార్లమెంట్‌కు తెలియచేశారు.
ట్రూడో ప్రభుత్వం ఆరోపణలను, భారత దౌత్యవేత్త బహిష్కరణను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. భారత్‌లోని కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. దీంతో ఉదయం న్యూఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో గల విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయానికి మెక్కే చేరుకున్నారు. మెక్‌కేకు భారత్‌లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విదేశాంగ తెలిపింది. ఐదు రోజుల్లోగా ఆ దౌత్యవేత్త దేశాన్ని వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ‘మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఆ దౌత్యవేత్తను బహిష్కరించాం’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.
మరోవైపు, విదేశాంగ కార్యాలయానికి వచ్చిన కెనడా హైకమిషనర్ కామెరూన్.. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆఫీసు నుంచి బయటకు వచ్చిన ఆయన్ను విలేకరులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా కామెరూన్ వారిని పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయారు.