నవతెలంగాణ – కెనడా
కెనడాలోని టొరంటోలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్థాన్ మద్దతుదారులు ప్రదర్శన చేపట్టారు. దీనికి ప్రతిగా మువ్వన్నెల జెండాలతో భారతదేశ మద్దతుదారులు ప్రదర్శన నిర్వహించారు. కెనడా కాలమానం ప్రకారం శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఖలిస్థాన్ మద్దతుదారులు జెండాలతో భారత రాయబార కార్యాలయం చేరుకుని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనపై మండిపడ్డ భారత సంతతి ప్రజలు త్రివర్ణ పతాకాలతో అక్కడికి చేరుకుని ప్రదర్శన చేశారు. పోటాపోటీగా ఇరు పక్షాలు ప్రదర్శన చేపట్టడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాల మధ్య బారికేడ్లు పెట్టి విడదీశారు. ఈ నిరసనలకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 8న భారత రాయబార కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టాలని ఖలిస్థాన్ మద్దతుదారులు ఆన్ లైన్ లో కొన్నిరోజులుగా ప్రచారం నిర్వహించారు. దీనికి తోడు ఇటీవల ఇండియన్ ఎంబసీలపై దాడులు పెరిగిపోతున్నాయి. దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ ఏర్పాట్లను అమెరికాలోని భారతదేశ అంబాసిడర్ తరణ్ జీత్ సింగ్ సంధు పరిశీలించారు.