అమెరికాలో భారత కాన్సూలేట్‌కు నిప్పంటించిన ఖలిస్థానీలు!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఖలిస్థానీ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలో గల భారత దౌత్య కార్యాలయంపై దాడి చేసి నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి 1.30కి ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా తాజాగా పేర్కొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, అగ్నికీలల్లో చిక్కుకున్న కార్యాలయం వీడియోను ఖలిస్తానీ వాదులే బయటపెట్టినట్టు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ఈ హేయమైన చర్యను తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. దౌత్యకార్యాలయాలపై దాడులకు పాల్పడడం క్రిమినల్ నేరమని హెచ్చరించారు. ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అరెస్టుకు సిద్ధమైన సందర్భంలోనూ ఖలిస్థానీలు శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారత దౌత్యకార్యాలయాన్ని టార్గెట్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చి దౌత్య కార్యాలయం భవనం గోడలపై అభ్యంతరకర రాతలు రాశారు. కార్యాలయం తలుపులను ఇనుప రాడ్లతో కొట్టారు. ప్రాంగణంలో ఖలిస్థానీ బ్యానర్లు నెలకొల్పారు.

Spread the love