న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ ఉనికి చాటుకునేందుకు, పార్టీని తిరిగి బలోపేతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆలోచన చేస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలోని దళిత ఓటర్లను తనవైపు తిప్పుకోవచ్చని అంచనా వేస్తోంది. రాష్ట్ల్రంలోని ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలైన ఇటావా, బారాబంకి నియోజవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి ఖర్గేను పోటీ చేయించేలా కాంగ్రెస్ ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతోపాటు కర్ణాటకలోని ఖర్గే సొంత నియోజకవర్గం నుంచి కూడా ఆయనను బరిలోకి దించనుంది. ఉత్తర ప్రదేశ్‌లోనూ ఖర్గేను నిలపడం ద్వారా ఇటు కాంగ్రెస్‌తో పాటు అటు ఇండియా ఫోరంలో భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)కి కూడా దళితుల మద్దతు పెరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు రాహుల్‌గాంధీ.. కేరళలోని ప్రస్తుత సిటింగ్ స్థానం వయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని అమేధి నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నాయుకులు చెబుతున్నారు.