నవతెలంగాణ – హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలడంతో ఢిల్లీలో అటు ఎన్డీయే.. ఇటు ‘ఇండియా’ కూటమి నేతల భేటీలతో దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ సాయంత్రం జరిగిన ‘ఇండియా’ కూటమి నేతల సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోడీడీకి వ్యతిరేకంగా వచ్చిందన్న ఖర్గే.. ఆయన నైతికంగా ఓడిపోయారన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ‘ఇండియా’ కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే పేర్కొన్నారు.