ఖతర్నాక్‌ కామెరూన్‌

గ్రీన్‌ సెంచరీతో ముంబయి గెలుపు
ఓటమితో సన్‌రైజర్స్‌ నిష్క్రమణ
201 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్‌ ఊదేసింది. కామెరూన్‌ గ్రీన్‌ (100 నాటౌట్‌) అజేయ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (56) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కామెరూన్‌, రోహిత్‌ మెరుపులతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ముంబయి ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పదో పరాజయంతో ఐపీఎల్‌16 నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిష్క్రమించింది.

నవతెలంగాణ-ముంబయి
కామెరూన్‌ గ్రీన్‌ (100 నాటౌట్‌, 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఖతర్నాక్‌ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 47 బంతుల్లోనే సెంచరీ సాధించిన కామెరూన్‌ గ్రీన్‌ చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఎదురులేని విజయాన్ని అందించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (56, 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) సైతం రాణించటంతో 201 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్‌ 18 ఓవర్లలోనే ఛేదించింది. మరో 12 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (83, 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), వివ్రాంత్‌ శర్మ (69, 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ల మెరుపులతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోరు సాధించింది. ఛేదనలో శతక హీరో కామెరూన్‌ గ్రీన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో 16 పాయింట్లు సాధించిన ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌లో చోటుకు మరింత చేరువైంది!.
గ్రీన్‌ దంచికొట్టగా.. : ఛేదనలో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (14) ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (56)తో జతకట్టిన కామెరూన్‌ గ్రీన్‌ (100 నాటౌట్‌) మ్యాచ్‌ను ముంబయి చేతుల్లోకి తీసుకున్నాడు. పవర్‌ప్లేలో ముంబయి 60 పరుగులు పిండుకోగా.. కామెరూన్‌ గ్రీన్‌ వచ్చీ రాగానే బౌండరీలపై విరుచుకుపడ్డాడు. ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 20 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన గ్రీన్‌.. ఛేదనను సులభతరం చేశాడు. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 బంతుల్లో అర్థ శతకం బాదాడు. రోహిత్‌, గ్రీన్‌ జోడి రెండో వికెట్‌కు ఏకంగా 128 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. కామెరూన్‌ దూకుడుగా విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్ల రూపంలోనే 80 పరుగులు పిండుకున్న కామెరూన్‌ గ్రీన్‌.. సన్‌రైజర్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. రోహిత్‌ నిష్క్రమించినా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (25 నాటౌట్‌, 16 బంతుల్లో 4 ఫోర్లు) తోడుగా మరో 12 బంతులు ఉండగానే లాంఛనం ముగించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, మయాంక్‌ డాగర్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. యువ పేసర్లు కార్తీక్‌ త్యాగి, ఉమ్రాన్‌ మాలిక్‌ భారీగా పరుగులు ఇచ్చారు.
ఓపెనర్ల మెరుపుల్‌ : సీజన్లో తొలిసారి సన్‌రైజర్స్‌కు అదిరే ఆరంభం లభించింది. ఆరంగేట్ర ఓపెనర్‌ విశ్రాంత్‌ శర్మ (69), మయాంక్‌ అగర్వాల్‌ (83) తొలి వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ముంబయి బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు అలవోకగా పరుగులు పిండుకున్నారు. పవర్‌ప్లేలో 53 పరుగులు సాధించిన ఓపెనర్లు.. మిడిల్‌ ఓవర్లలో 104 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్‌ భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. వివ్రాంత్‌ ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. మయాంక్‌ అగర్వాల్‌ సైతం ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 బంతుల్లో ఆ ఫిఫ్టీ చేశాడు. ఓపెనర్ల నిష్క్రమణతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మందగించింది. క్లాసెన్‌ (18), ఫిలిప్స్‌ (1), బ్రూక్‌ (0) నిరాశపరిచారు. చివరి బంతికి సిక్సర్‌ బాదిన మార్క్‌రామ్‌ (13 నాటౌట్‌) జట్టు స్కోరు 200 చేశాడు. ముంబయి బౌలర్లలో ఆకాశ్‌ (4/37) నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : వివ్రాంత్‌ శర్మ (సి) రమణ్‌దీప్‌ (బి) ఆకాశ్‌ 69, మయాంక్‌ అగర్వాల్‌ (సి) కిషన్‌ (బి) ఆకాశ్‌ 83, క్లాసెన్‌ (బి) ఆకాశ్‌ 18, గ్లెన్‌ ఫిలిప్స్‌ (సి) కార్తికేయ (బి) జోర్డాన్‌ 1, మార్క్‌రామ్‌ నాటౌట్‌ 13, హ్యారీ బ్రూక్‌ (బి) ఆకాశ్‌ 0, సన్వీర్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200.
వికెట్ల పతనం : 1-140, 2-174, 3-186, 4-186.
బౌలింగ్‌ : బెహాన్‌డార్ఫ్‌ 3-0-36-0, కామెరూన్‌ 1-0-2-0, జోర్డాన్‌ 4-0-42-1, ఆకాశ్‌ 4-0-37-4, చావ్లా 4-0-39-0, కార్తికేయ 4-0-39-0.
ముంబయి ఇండియన్స్‌ : ఇషాన్‌ కిషన్‌ (సి) బ్రూక్‌ (బి) భువనేశ్వర్‌ 14, రోహిత్‌ శర్మ (సి) నితీశ్‌ (బి) మయాంక్‌ 56, కామెరూన్‌ నాటౌట్‌ 100, సూర్యకుమార్‌ నాటౌట్‌ 25, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (18 ఓవర్లలో 2 వికెట్లకు) 201.
వికెట్ల పతనం : 1-20, 2-148,
బౌలింగ్‌ : భువనేశ్వర్‌ 4-0-26-1, నితీశ్‌ 3-0-35-0, మయాంక్‌ డాగర్‌ 4-0-37-1, కార్తిక్‌ త్యాగి 2.5-0-41-0, ఉమ్రాన్‌ 3-0-41-0, వివ్రాంత్‌ 1-0-19-0, మార్క్‌రామ్‌ 0.1-0-1-0.

Spread the love