ఖతర్నాక్‌ కిరణ్‌

– వరల్డ్‌ నం.9పై జార్జ్‌ గెలుపు
– సైనా, అష్మిత, లక్ష్యసేన్‌ ముందంజ
– సింధు, ప్రియాన్షు, శ్రీకాంత్‌ ఓటమి
– థాయ్లాండ్‌ ఓపెన్‌ 2023
బ్యాంకాక్‌ (థాయ్లాండ్‌)
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో టీమ్‌ ఇండియా యువ కెరటాల సంచలనాల మోత మోగుతోంది. 23 ఏండ్ల కిరణ్‌ జార్జ్‌ (కేరళ) థారులాండ్‌ ఓపెన్‌లో ఖతర్నాక్‌ విజయం నమోదు చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌, వరల్డ్‌ నం.9 షి యుకి (చైనా)పై మెరుపు విజయం నమోదు చేశాడు. 21-18, 22-20తో చైనా స్టార్‌కు చుక్కలు చూపించిన కిరణ్‌ జార్జ్‌.. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. వెటరన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌, లక్ష్యసేన్‌, అష్మిత చాలిహ ముందంజ వేయగా.. అగ్రశ్రేణి షట్లర్లు పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్‌, ప్రియాన్షు, సాయి ప్రణీత్‌లు పరాజయం పాలయ్యారు.
జార్జ్‌ జోరు : పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్‌ కిరణ్‌ జార్జ్‌ రెచ్చిపోయాడు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జార్జ్‌ వరల్డ్‌ నం.9, మూడో సీడ్‌ చైనా ఆటగాడు షి యుకిపై వరుస గేముల్లో గెలుపొందాడు. 47 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో జార్జ్‌.. షి యుకిపై ఓ గేమ్‌లో ఏకంగా వరుసగా 9 పాయింట్లు కొల్లగొట్టాడు. టైబ్రేకర్‌కు దారితీసిన రెండో గేమ్‌లోనూ పైచేయి సాధించిన జార్జ్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. 21-18, 22-20తో చైనా షట్లర్‌ను చిత్తు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. యువ కెరటం లక్ష్యసేన్‌ 21-23, 21-15, 21-15తో వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపీ)పై మూడు గేముల పోరులో పైచేయి సాధించాడు. మహిళల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 సైనా నెహ్వాల్‌ శుభారంభం చేసింది. కెనడా షట్లర్‌ వెన్‌ యు జాంగ్‌పై 21-13, 21-7తో అలవోక విజయం నమోదు చేసింది. 26 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన సైనా ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. యువ షట్లర్‌ అష్మిత చాలిహ 21-17, 21-14తో సహచర షట్లర్‌ మాళవిక బాన్సోద్‌పై సాధికారిక విజయం నమోదు చేసింది. పురుషుల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడి 21-13, 18-21, 21-17తో డెన్మార్క్‌ షట్లర్లపై 59 నిమిషాల్లో ప్రీ క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు.
మహిళల సింగిల్స్‌ స్టార్‌ షట్లర్‌ పి.వి సింధు పరాజయం పాలైంది. 8-21, 21-18, 18-21తో కెనడా షట్లర్‌ మిచెలీ లీ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో ఓటమి చెందింది. 62 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో నిర్ణయాత్మక గేమ్‌లో సింధు చేతులెత్తేసింది. మెన్స్‌ సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ పరాజయాల పరంపర కొనసాగుతుంది. చైనా షట్లర్‌ హాంగ్‌ యంగ్‌ వెంగ్‌తో పోరులో 8-21, 21-16, 14-21తో శ్రీకాంత్‌ మూడు గేముల్లో పోరాడి ఓడాడు. సమీర్‌ వర్మ 15-21, 15-21తో మాగస్‌ జొహాన్సెన్‌ (డెన్మార్క్‌), ప్రియాన్షు రజావత్‌ 19-21, 10-21తో మలేషియా షట్లర్‌ యోంగ్‌ చేతిలో ఓటమి చెందారు.

Spread the love