– రాష్ట్రపతి భవన్‌లో స్పోర్ట్స్ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: జాతీయ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానం రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం అట్టహాసంగా జరిగింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులను ఈ ఏడాది నలుగురు అథ్లెట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అందుకున్నారు. ఖేల్‌రత్న అవార్డులు అందుకున్న వారిలో పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన యువ మహిళా షూటర్ మను బకర్‌తోపాటు ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్, రెండుసార్లు ఒలింపిక్స్‌లో భారత హాకీజట్టు కాంస్య పతకాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ హైజంపర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. 22ఏళ్ల మను బకర్ గత ఏడాది ఆగస్టులో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంపాటు 10మీ. ఎయిర్ స్టిల్ మిక్స్‌డ్ టీం విభాగాల్లో కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రమంలో ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా బకర్ చరిత్ర సృష్టించింది. ఇక 18ఏళ్ల గుకేశ్.. 2024 డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. దీంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ రికార్డుల్లోకెక్కాడు. అలాగే చెస్ లిపియాడ్‌లోనూ భారత పురుషుల జట్టు బంగారు పతకం సాధించడంలోనూ గుకేశ్ కీలకపాత్ర పోషించాడు. వీరితోపాటు 32మంది అథ్లెట్లు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డులు అందుకున్నారు. వీరిలో 17మంది పారా అథ్లెట్లు ఉన్నారు. తొలి పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పేట్కర్, సచ్ఛా సింగ్‌లకు జీవితకాల సాఫల్య అర్జున అవార్డుతో ఘనంగా సత్కరించారు. వీరితోపాటు నలుగురికి ద్రోణాచార్య, ఇద్దరికి లైఫ్‌టైమ్ కేటగిరీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అందజేశారు. మౌలానా అబుల్ కలామ్ అజాద్ ట్రోఫీ ఓవరాల్ విజేతగా ఛండీగర్ యూనివర్శిటీకి, తొలి రన్నరప్ లౌల్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ, రెండో రన్నరర్‌గా అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీలకు సర్టిఫికెట్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.