విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ హిట్టా.. ఫట్టా..!

చిత్రం: ఖుషి; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, సమంత, సచిన్‌ ఖేడ్కర్‌, శరణ్య పొన్నవణ్ణన్‌, మురళీశర్మ, రోహిణి, వెన్నెల కిషోర్‌, జయరామ్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు; సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌; సినిమాటోగ్రఫీ: మురళి జి; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి; నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌; రచన, దర్శకత్వం: శివ నిర్వాణ; విడుదల: 01-09-2023.

గత ఏడాది వచ్చిన ‘లైగర్‌’ తీవ్రంగా నిరుత్సాహపరచడంతో తాజా చిత్రం ‘ఖుషి’తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనే కసి విజయ్‌ దేవరకొండలో కనిపించింది. ఈ మ్యూజికల్‌ లవ్‌స్టోరీలో విజయ్‌ దేవరకొండతో సమంత జోడీ కట్టడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సమంత అనారోగ్యం కారణంగా గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా పాటలు అన్ని భాషల్లో పాపులర్‌ కావడం, ట్రైలర్‌ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది.  ఈ నేపథ్యంలో ‘ఖుషి’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో తెలుసుకుందాం..

క‌థలోకి వెళ్లితే: విప్ల‌వ్ దేవ‌ర‌కొండ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ప్ర‌భుత్వ ఉద్యోగంపై ఇష్టంతో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌లో జేటీవోగా విధుల్లో చేరతాడు. ఏరికోరి క‌శ్మీర్‌లో పోస్ట్ వేయించుకుంటాడు. అక్క‌డే ఆరా బేగం (స‌మంత‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. త‌మ్ముడిని వెదుక్కుంటూ తాను పాకిస్థాన్‌ నుంచి వ‌చ్చాన‌ని చెప్పినా, త‌న కోసం పాకిస్థాన్‌ వెళ్ల‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు విప్ల‌వ్‌. అంత‌గా త‌న‌ని ఇష్ట‌ప‌డ‌టం చూసి… ఆ ప్రేమ‌కి ఆరా కూడా ఫిదా అయిపోతుంది. కానీ, వీళ్ల ప్రేమ‌కి పెద్ద‌లు అడ్డు చెబుతారు. భిన్న కుటుంబ నేప‌థ్యాలకి చెందిన ఈ జంట విడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఇరు కుటుంబాలూ న‌మ్ముతాయి. మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట… పెద్ద‌లు చెప్పిన‌ట్టే విడిపోయిందా?  ఇంత‌కీ వీళ్ల కుటుంబాల క‌థేమిటి?పెళ్లయిన తర్వాత ఈ జంట మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి?

ఎలా ఉందంటే: ఒక జంట ప్రేమ‌… పెళ్లి జీవితం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ప్రేమ‌క‌థ‌ల్లో ప్ర‌ధాన సంఘ‌ర్ష‌ణకి ధ‌నిక‌, పేద‌, ప‌రువు, ప్ర‌తిష్ట‌, కులం, మ‌తం వంటి విష‌యాలే ఎక్కువ‌గా కార‌ణ‌మ‌వుతుంటాయి. ఈ క‌థ కూడా ఇంచుమించు అలాంటిదే. కాక‌పోతే ఇందులో ఆస్తికులు, నాస్తికులైన రెండు కుటుంబాల న‌మ్మ‌కాల నుంచి ఆ సంఘ‌ర్ష‌ణ‌ని సృష్టించి క‌థ‌ని న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. తొలి భాగం ప్రేమ‌క‌థ‌తో సాగితే, రెండో భాగం వైవాహిక జీవితం చుట్టూ సాగుతుంది. కొత్త నేప‌థ్య‌మే ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం.  ప్ర‌ధాన పాత్ర‌లు ప‌రిచ‌యం కాగానే… క‌థ క‌శ్మీర్‌కి చేరుతుంది. అక్క‌డ హీరో-హీరోయిన్లు ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ‌టం…  ఆ త‌ర్వాత ప్రేమ, విన‌సొంపైన పాట‌లు, క‌నువిందు చేసే క‌శ్మీర్ అందాల‌తో సినిమా హాయిగా సాగిపోతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ, వెన్నెల కిశోర్ నేప‌థ్యంలో హాస్య స‌న్నివేశాలు కూడా ప్ర‌థ‌మార్ధానికి ప్ర‌ధాన బ‌లం. ద్వితీయార్ధంలోనే అస‌లు సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మ‌ధ్య ఎలాంటి విష‌యాలు అపార్థాల‌కి కార‌ణ‌మ‌వుతుంటాయి? ఇక ఆ జంట భిన్న సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లతో మెలిగే కుటుంబాల నుంచి వ‌చ్చిన‌ప్పుడు ఆ అపార్థాలు ఇంకెంత‌గా ప్ర‌భావం చూపిస్తాయో సెకండాఫ్‌లో చూపించారు.

నటీనటుల పర్‌ఫార్మెన్స్‌
విప్లవ్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ చక్కటి నటనను కనబరిచాడు. ప్రేమికుడిగా, భర్తగా రెండు భిన్న పార్శాలున్న పాత్రల్లో మెప్పించాడు. కథానాయిక సమంతకు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ఆరాధ్య పాత్రలో బరువైన భావోద్వేగాలను పలికిస్తూ ఆకట్టుకుంది. మురళీశర్మ, సచిన్‌ ఖేడ్‌కర్‌ కథలో కీలకంగా నిలిచారు. వారిద్దరి నటన బాగుంది. ఇక వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తమదైన కామెడీ టైమింగ్‌, డైలాగ్స్‌తో మెప్పించారు. అబ్దుల్‌ వహాబ్‌ మ్యూజిక్‌ ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా కుదిరింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించినా ఓవరాల్‌గా ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఖుషి’ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బాక్సాఫీస్‌ వద్ద కూడా ఈ సినిమా మంచి ఫలితాలను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Spread the love