కిం.. కర్తవ్యం..?

Kim.. Duty..?– మరో రెండు వారాల్లో వానలు ?
– మరమ్మతులు సాధ్యమయ్యేనా ?
– కాళేశ్వరంపై తర్జనభర్జనలు
– ఇటు సర్కారు, అటు ఎల్‌అండ్‌టీ
– జుట్టు పీక్కుంటున్న వైనం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేయాల్సిన మరమ్మతుల విషయమై తర్జనభర్జన చోటుచేసుకుంటున్నది. దీనిపై ఒకవైపు సాగునీటిపారుదల శాఖ సమాలోచనలు చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకో రెండు వారాల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది ఈలోపు మూడు బ్యారేజీలకు రిపేర్లు చేయాలని ఎన్‌డీఎస్‌ఏ సాగునీటిపారుదల శాఖకు వారం రోజుల క్రితం మధ్యంతర నివేదికను పంపిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వ వ్వవహారాలు అంత తొందరగా తెమలవనే విషయం విదితమే. ఈలోపు పుణ్యకాలం కాస్త కరిగిపోయి వర్షాలు పడితే భారీ కష్టాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు జలసౌధ అధికారుల్లో అంతర్గత చర్చ సాగుతోంది. ప్రధానంగా మేడిగడ్డ మరమ్మతులకు ఎంత ఖర్చవుతుంది ? అన్నారం, సుందిళ్లకు ఏ మేరకు నిధులు అవసరం ? అనే అంశాలపై ఇథమిద్ధంగా ఇంకా స్పష్టత రాలేదు.. ప్రభుత్వం కొత్తగా నిధులు మంజూరు చేస్తుందా ? పాత నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ తో పనులు చేయింస్తుందా ? అనేది ఇంకా తేలలేదు. ఇదిలావుండగా నూతనంగా అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేస్తామని ఇప్పటికే ఎల్‌అండ్‌టీ సాగునీటి పారుదల శాఖకు స్పష్టం చేసింది. ఈవిషయమై ప్రభుత్వంలో సమాలోచనలు జరుగుతున్నాయి. పాత ఓప్పందాలను పరిశీలించే పనిలో అధికారులు ఉన్నారు. మూడు బ్యారేజీల మరమ్మతుల కోసం కనీసం రూ. 20 వేల కోట్లు అవసరమనే ప్రచారం జలసౌధలో జరుగుతున్నది. నిజానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) బయటకు వస్తేగానీ అసలు విషయం బయటపడే అవకాశం లేదు. మళ్లీ కొత్తగా నిధులు ఇచ్చేట్టయితే ఎల్‌అండ్‌టీతో ఎందుకు చేయించాలి ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కొత్త సంస్థకు అప్పగిస్తే నాణ్యంగా చేయించడానికి అవకాశం ఉంటుంది కదా ? అని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. అయితే కొత్త సంస్థ అయితే ఆలస్యం అవుతుందనీ, ఎల్‌అండ్‌టీ అయితే బ్యారేజీల లోతుపాతులు, సాంకేతిక అంశాలు, నిర్మాణ వ్యయం తదితర విషయాలపై అవగాహన ఉంటుందనే ప్రచారమూ ఉంది. ఇప్పుడు ఏంచేయాలనేది కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది. మరమ్మతు పనులు తిరిగి ఎల్‌అండ్‌టీకే అప్పగిస్తే రాజకీయంగా రేవంత్‌ సర్కారుపై విమర్శలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎల్‌అండ్‌టీని ఇంకా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారనే చర్చ సైతం ఇప్పటికే ప్రారంభమైంది. ఇదిలావుండగా ఓడిషా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ఆ రాష్ట్ర సాగనీటి ప్రాజెక్టులకు ఎల్‌అండ్‌టీ టెండర్లు దాఖలు చేసింది. కాళేశ్వరం విషయమై తాము మీడియాలో చూశామనీ, ఎల్‌అండ్‌టీకి మీరు క్లిన్‌చిట్‌ ఇచ్చారా ? అంటూ సాగునీటి పారుదల శాఖకు ఓడిషా సర్కారు లేఖ రాసింది. ఈమేరకు సమాధనం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల హామీలు అమలుచేయడానికి మళ్లీ అప్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం బ్యారేజీలు సర్కారుకు గుదిబండ కానున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రైతుబంధు, రుణమాఫీ పథకాలు అమలు చేయానికి సర్కారు నిధుల కొరతను ఎదుర్కొంటున్నదని సమాచారం. ఇటీవల రుణమాఫీ కోసం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో అప్పులు తెస్తామని గత మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో సీఎం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే పరిపాలనపై దృష్టిపెడతామని కూడా చెప్పారు. ఈనేపథ్యంలో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరంపై రెండు, మూడు రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా ఈ రెండు వారాల్లో అసలు మరమ్మతులు సాధ్యమవుతాయా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Spread the love