ఆకలి రాజ్యం

Kingdom of hunger– 2015 నుంచీ ధరల మంట
– పేద, సామాన్య ప్రజల బాధలు వర్ణానాతీతం
– ఈ ఎన్నికల్లో బీజేపీ 3.0 కు ఎదురు దెబ్బే : సామాజికవేత్తలు, విశ్లేషకులు
ఎన్నికలోస్తేనే గుమ్మం ముందు నేతలు వాలుతారు. అలాగే కడుపునిండిన వాడికి పేదవాడి కన్నా.. పెద్దోడి బాగోగులు.. అధికారం కోసమే పాకులాడటం కామన్‌గా మారిపోయింది. పదేండ్ల కాలంలో ధరలు మండు తుంటే.. ఇక్కడి జనం తినకపోయినా.. విదేశాల మెహర్బానీ కోసం ఇక్కడి ఆహార పదార్థాలను మోడీ సర్కార్‌ ఎగుమతి చేస్తోంది. పేద, సామాన్య ప్రజల బాధలు కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతాయన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 3.0కు చుక్కలు చూపించడటం ఖాయమని ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.
న్యూఢిల్లీ : మోడీ పాలనలో ఆహార ద్రవ్యోల్బణం ఒక సమస్యగా మారింది. 2015 నుంచి ఇది మోడీ సర్కాను వేధిస్తున్నది. అంతేకాదు.. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇటు సామాన్య ప్రజలూ కష్టాలను అనుభవిస్తూ వస్తున్నారు. ఈ ధరల పెరుగుదల ప్రభావం ఈ ఎన్నికల్లో కనబడుతుందనీ, మోడీ సర్కారుకు ఓటర్ల నుంచి ప్రతిఘటన ఎదురు కాక తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆదాయం అంతతైనా.. జేబులకు చిల్లులే..
దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గినట్టు కనిపించటంలేదని అంటున్నారు. ధరల పెరుగుదల ప్రభావం కోట్లాది మంది భారతీయులకు కష్టమవుతున్నదని చెప్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణం సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నదని అంటున్నారు.
2014 ఎన్నికల తర్వాత మోడీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి ఏడాది నుంచే ఆహార ద్రవ్యోల్బణం మోడీ సర్కారుకు అతి పెద్ద సమస్యగా పరిణమించిది. బీజేపీ సర్కారు మొదటి సంవత్సరం దాల్‌ స్కామ్‌తో దెబ్బతిన్నది. దీని ఫలితంగా పప్పుధాన్యాల ధరలు కిలో రూ.200కి చేరుకున్నాయి. ప్రస్తుతం, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూరగాయల ధరలు ప్రియం కావటంతో ఆహార ద్రవ్యోల్బణం 8.66 శాతానికి చేరుకున్నది. జనవరిలో కూరగాయలపై 30.25 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ధరలు 27.03 శాతం పెరిగాయి. టమాటాలు కిలోకు రూ. 200, ఉల్లిపాయలు, గోధుమలు, పంచదార, ఇతర ఆహార పదార్థాలకు విపరీతమైన ధరలు చెల్లించి కొనాల్సిన దుస్థితి భారతీయులకు ఏర్పడిందని సామాన్య జనం మోడీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనలేక..
భారతదేశంలో 2024 ఎన్నికలు సమీపించిన తరుణంలో.. 2022 చివరి నాటికి జాతీయ ఆహార భద్రతా చట్టం నుంచి అదనపు ఆహార రేషన్‌లను తొలగించిన తర్వాత, ప్రభుత్వం ఉచిత రేషన్‌ కార్యక్రమాన్ని బలవంతంగా నిర్వహించవలసి వచ్చిందనీ, 80 కోట్ల మంది భారతీయులకు ఆహారం అందించడం కొనసాగించిందని విశ్లేషకులు చెప్తున్నారు. నిటి ఆయోగ్‌ తన 2023 నివేదికలో 74.1 శాతం మంది భారతీయులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయటానికి కష్టపడుతున్నారని పేర్కొన్నది. ఈ గణాంకాలతో ఐక్యరాజ్యసమితి సైతం ఏకీభవించటం గమనార్హం.
2013 జులైలో గోధుమల ధరలు కిలోకు రూ. 16.10 ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి రూ. 23.65కి ఎగబాకింది. గత రెండేండ్లుగా గోధుమల ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. అధిక ఎరువుల ధరలు, అస్థిర వాతావరణం, విధాన నిర్ణయాల లోపం కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు.
పాలు.. వంట గది అవసరాలూ భారమే..
పాలు వంటి ఇతర వంటగది అవసరాలు కూడా గత సంవత్సరం రిటైల్‌ ధరలో 15 శాతం పెరుగుదలను నివేదించాయి. ఆ తర్వాత ఎడిబుల్‌ ఆయిల్‌ ద్రవ్యోల్బణం కూడా కనిపించింది. 2021లో ధరలు రూ. 80 నుంచి రూ.180కి పెరిగాయి. కూరగాయలు, ముఖ్యంగా టమాటాలు, పెట్రోలు కంటే ఖరీదైనవిగా మారటం సాధారణ భారతీయుల బాధలను మరింత తీవ్రం చేసిందని విశ్లేషకులు అంటున్నారు. వాతావరణ పరిస్థితులకు తోడు మోడీ సర్కారు తప్పుడు విధాన నిర్ణయాల కారణంగా ఉల్లి ధరలు కూడా చాలా అస్థిరంగా ఉన్నాయి. 2014 ఫిబ్రవరిలో నాసిక్‌ మండిలో కిలో ఉల్లి రూ. 45గా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి రూ.13.8కి పెరిగింది.
అధిక ఆహార ద్రవ్యోల్బణంతో షోషకాహార లోపం
అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా ఆకలి, మరింత పోషకాహార లోపం సమస్యలు తలెత్తుతాయని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. అధిక ద్రవ్యోల్బణం వచ్చే చిక్కులు ఇప్పటికే పేద, సాధారణ మధ్య తరగతి ప్రజలను పౌష్టికాహారానికి ఏమో కానీ.. కనీస ఆహారానికి కూడా దూరం చేస్తున్నదని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ఇటు సరైన ధరలు లేకపోవటంతో రైతులు కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ధరల పెరుగుదల ప్రధానంగా పెద్ద వ్యాపారులు, స్టాకర్లు, అగ్రి-ప్రాసెసర్‌లకు ప్రయోజనం చేకూరుస్తాయనీ, ద్రవ్యోల్బణం దెబ్బకు వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు, రైతులు, చిన్న వ్యాపారులందరూ నష్టాన్ని, ఇబ్బందులను ఎదుర్కొంటారని నిపుణులు చెప్తున్నారు. భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం జాతీయ, ప్రపంచ సగటు కంటే మళ్లీ పెరుగుతున్నదనీ, దశాబ్దం పాటు అధికారంలో ఉన్న మోడీ సర్కారు మాత్రం దానిని నియంత్రించడంలో విఫలమైందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆహార ద్రవ్యోల్బణం సమస్య ఓట్ల రూపంలో ప్రతిబింబిస్తుందని సామాజికవేత్తలు అంటున్నారు.
వేసవిలో భారతీయులందరికీ నచ్చే పండు మామిడిపండ్లు. ఒక నివేదిక ప్రకారం, 2012 బేస్‌ ఇయర్‌ నుంచి 2023 వరకు మామిడి ధర సూచిక విలువ దాదాపు 116 శాతం పెరిగింది. నివేదిక 2013 ఆర్థిక సంవత్సరానికి గానూ ధర రూ.96గా ఉండగా..2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 216.1కి ఎగబాకింది. యాపిల్స్‌ ధరలు కూడా పెరిగాయి. యాపిల్‌ మార్కెట్లపై కార్పొరేట్‌ నియంత్రణకు వ్యతిరేకంగా రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. యాపిల్‌ రైతులు హిమాచల్‌ ప్రదేశ్‌లో అదానీ స్టోర్‌లకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ భవనాల వెలుపల కూడా నిరసనలు నిర్వహించారు.

Spread the love