హైదరాబాద్ : భారత క్రీడా విపణీలో మరో స్పోర్ట్స్ లీగ్ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పాపులర్ గేమ్ ‘ఆర్మ్ రెజ్లింగ్’ను ప్రధాన స్రవంతి క్రీడల్లోకి తీసుకురానున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఫేమ్ ప్రీతి జింగానియా ‘ప్రొ పంజా లీగ్’ సహా వ్యవస్థాపకురాలు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆటగాళ్ల డ్రాఫ్ట్ పూర్తి కాగా కిరాక్ హైదరాబాద్ 30 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తెలంగాణ ఆర్మ్ రెజ్లర్ అహ్మద్ ఫైజాన్ అలీ తొలి సీజన్లో కిరాక్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడని జట్టు యజమాని గౌతమ్ రెడ్డి అన్నారు. జులై 28 నుంచి ఆగస్టు 13 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రొ పంజా లీగ్ నిర్వహించనున్నారు.