తెలుగులో ప్రమాణం చేసిన కిషన్‌ రెడ్డి…

నవతెలంగాణ – హైదరాబాద్: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోడీ వార‌ణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో  ఎన్డీయే మంత్రివర్గంలోని కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బండి సంజయ్‌, భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. ఇదులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌ (చిన్ని), లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు. మిగతావారు హిందీ, ఇంగ్లీష్‌లలో ప్రమాణం చేశారు.  తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం మొద‌లవుతుంది. ఈ నెల 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.

Spread the love