వార్మప్ మ్యాచ్ లో పాక్ పై కివీస్ భారీ విజయం..

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ అదరిపోయే ఆటతీరు ప్రదర్శించింది. పాకిస్థాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరల్డ్ కప్ సన్నద్ధతను ఘనంగా చాటుకుంది. ఈ ప్రాక్టీసు మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 103, కెప్టెన్ బాబర్ అజామ్ 80, సాద్ షకీల్ 75 పరుగులు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో కివీస్ కేవలం 43.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. కివీస్ ఇన్నింగ్స్ లో యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఇన్నింగ్సే హైలైట్. 23 ఏళ్ల రచిన్ రవీంద్ర ఓపెనర్ గా వచ్చి 97 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 54, డారిల్ మిచెల్ 59 పరుగులు చేయగా… మార్చ్ చాప్ మన్ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చాప్ మన్ 41 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఆల్ రౌండర్ జేమ్స్ నీషామ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో అవుటయ్యాడు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2, హసన్ అలీ 1, ఆఘా సల్మాన్ 1, మహ్మద్ వాసిం జూనియర్ 1 వికెట్ తీశారు.

Spread the love