కేటీఆర్ చెపితే నార్కో టెస్ట్ కు ఏర్పాట్లు చేస్తాం: కేకే మహేందర్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎన్నికల్లో తనను ఓడించారని ఆయన మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం తనను బెదిరించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని…అయినా కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అవసరమైతే తాను నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా సిద్ధమని కేటీఆర్ అంటున్నారని… కేటీఆర్ ఎప్పుడు వస్తారో టైమ్, ప్లేస్ చెపితే నార్కో అనాలసిస్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ వెనక్కి తగ్గకుండా టెస్టులకు రావాలని సవాల్ విసిరారు. మేడిగడ్డ రూపంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాపాల పుట్ట పగిలిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కరవుతో ఇబ్బంది పడాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆరు గ్యారెంటీల్లోని మిగిలిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.

Spread the love