మహిళా చట్టాలపై అవగాహన అవసరం

– తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ హైమవతి
నవతెలంగాణ – పెద్దవంగర
మహిళా రక్షణ చట్టాలపై మహిళలందరికీ పూర్తి అవగాహన అవసరమని తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ హైమవతి, ఎం.ఎల్.హెచ్.పీ హరిప్రియ అన్నారు. మంగళవారం గంట్లకుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళా రక్షణ చట్టాలపై  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భ్రూణ హత్యలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆడ, మగ సంతానం ఇద్దరిని సమానంగా చూసినప్పుడే సమాజంలో మహిళల పట్ల చులకన భావన పోతుందన్నారు. ఆడ పిల్లలకు కుటుంబ కట్టుబాట్లు నేర్పించడం వల్ల వారిలో బెరుకు, భయం వంటివి వస్తాయన్నారు. బాలికల పట్ల సద్భావం ఏర్పడేలా పాఠశాల దశ నుంచే బాలురకు వారి తల్లిదండ్రులు నేర్పించాలన్నారు. అప్పుడే మహిళలపై అఘాయిత్యాలు కట్టడి అవుతాయని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయని, మహిళలు వాటిని వినియోగించుకుని సమాజంలో నిర్భయంగా తిరగాలన్నారు. మహిళా చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకుని మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతూ దూసుకుపోవాలని ఆకాంక్షించారు. బాల్య వివాహాల నివారణ, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిరోధించడం వంటి అనేక మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆడపిల్లలను రక్షించండి, చదివించండని అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కవిత రెడ్డి, ఏఎన్ఎం సుంకరి ఈశ్వరి, అంగన్వాడీ టీచర్స్ స్వరూప, ఇందిరా, ఆశ కార్యకర్త శోభారాణి, అంగన్వాడీ సిబ్బంది బుచ్చమ్మ, ఉప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love