రాజకీయాలను డబ్బుతో ముడిపెడుతూ కలుషితం చేశారు : కోదండరాం

నవతెలంగాణ-హైదరాబాద్ : గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయాలను డబ్బుతో ముడిపెడుతూ కలుషితం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నేతలు స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడి భూదందాలు, సెటిల్‌మెంట్లు, ఇసుక దందాలు చేస్తూ అక్రమ వ్యాపకాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ప్రజల వెనుకబాటుతనానికి తెలంగాణలో రాజకీయాలే ప్రధాన కారణమని కోదండరాం తెలిపారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరుగడంలేదని విచారం వ్యక్తం చేశారు. తొమ్మెదేళ్ల పాలనలో గుప్పెడు మంది కార్పొరేట్‌ శక్తులకు పాలకులు కొమ్ముకాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెంగాణ బచావ్‌ టీజేఎస్‌ నినాదమని, సంఘటితంగా అందరం కలిసి ఉద్యమ అధికారాలను సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఇప్పటివరకు సుమారు 200 మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. ఉద్యమకారులను పక్కనబెట్టి ఉద్యమద్రోహులను సంకలో పెట్టుకుని తెంగాణలో ముఖ్యనేతలు ఊరేగుతున్నారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు అందరం కలిసికట్టుగా సంఘటితమై ఎదుర్కొకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు.

Spread the love