నవతెలంగాణ హైదరాబాద్: మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని క్యాట్ చెప్పిందన్నారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరో రకంగా చేయడంతోనే కుంగిపోయిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా సరిగా లేదని డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి కాలువల ద్వారా నీరు తీసుకురాగలిగితే గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుందన్నారు. తుమ్మిడిహట్టిని పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్‌ను కోరాం. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసింది.
మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. బీఆర్ఎసే విచారణ కమిషన్ వేయాలని కోరింది. కమిషన్ వేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో ఆ పార్టే కోరింది. ప్రజల సొమ్మును ఏ ప్రభుత్వమైనా బాధ్యతగా ఖర్చు చేయాలి. విచారణ కమిటీని రద్దు చేయించి.. వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని వారు చూస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తమపైన ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యం. బీఆర్ఎస్ పాలనలో మాపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నాను. బొగ్గు గనులను వేలం వేయడమంటే అది ప్రైవేటీకరణకు దారి తీస్తోంది. బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.