నేడు సీఎం సభలో కోడి కత్తి రిపీట్‌ కాబోతుంది

నేడు సీఎం సభలో కోడి కత్తి రిపీట్‌ కాబోతుంది– ప్రజల సానుభూతి కోసం కేసీఆర్‌ డ్రామా
– గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సారెడ్డి కీలక వ్యాఖ్యలు
నవ తెలంగాణ- గజ్వేల్‌
ఈ నెల 28న గజ్వేల్‌లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచార సభలో కోడి కత్తి డ్రామా రిపీట్‌ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి అన్నారు. తన ఇంటికి భద్రత కల్పించాలని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన గజ్వేల్‌లో ఆయన తన ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం గజ్వేల్‌లో జరిగే సీఎం సభలో వారే అల్లర్లు సృష్టించుకొని కాంగ్రెస్‌పై నెట్టే అవకాశం ఉందని అన్నారు. దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తిపోట్ల దాడి కాంగ్రెస్‌ పని అని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారన్నారు. పోలీస్‌ శాఖ మాత్రం కాంగ్రెస్‌ చేసింది కాదని తేల్చిందని చెప్పారు. కాంగ్రెస్‌కు రక్త చరిత్ర ఉన్నదని కేసీఆర్‌ చెప్పడం సిగ్గుచేటన్నారు. 1200 మంది అమరవీరుల కుటుంబాల పుణ్యమా అని సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ రక్త చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో ముఖ్యమంత్రికి ఓటమి తప్పదని చెప్పారు.
డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కు ప్రజల సానుభూతి కాదు కదా ఆయనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార రథాలను 40 గ్రామాల్లో ప్రజలు రానివ్వలేదని చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మల్లారెడ్డి, సర్దార్‌ ఖాన్‌, నాగరాజు, అంజా గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Spread the love