‘కొలువు’…రాజకీయ నెలవు!

'Koluvu'...political month!‘అంతన్నాడింతన్నాడే గంగరాజు… ముంతమామిడి పండన్నాడే గంగరాజు…’ రాష్ట్ర బీజేపోళ్ల హుషారు చూస్తే ఈ పాటే గుర్తుకు వస్తోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం… జనాల్ని ఏమార్చటం వారికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనుకుంటా! అందుకే తెలంగాణ కాషాయ దళపతి కిషన్‌రెడ్డి… బుధవారం హైదరాబాద్‌లో ఒక బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఆయన 24 గంటల దీక్షను చేపట్టారు. అదీ నిరుద్యోగ సమస్యపై. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు ఇలా నిరుద్యోగంపై బీజేపీ ఆందోళన చేపట్టడమంటే దెయ్యాలు వేదాలు వల్లించటమే. తాము అధికారంలోకొస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని నమ్మబలికి, గద్దెనెక్కింది కమలం పార్టీ. ఆ చొప్పున ఇప్పటికి గత పదేండ్ల నుంచి దేశవ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలను ఇవ్వాలి. కానీ అచ్ఛేదిన్‌ అంటూ ఇప్పటిదాకా కొంగ జపం చేసి.. ఇప్పుడు అమృత్‌కాల్‌ అంటూ ఊదరగొడుతున్న ప్రధాని మోడీ, 20 కోట్ల కొలువులను సృష్టించటం మాట అటుంచి… ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు.
దేశంలో నిరుద్యోగానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే విస్తుగొలిపే వాస్తవాలు బయట కొస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్‌ను దాటేశామంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు మీసాలు మెలేస్తున్నారు. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం మన పరిస్థితి నానాటికీ తీసికట్టు అనే విధంగా ఉంది. 2016 నుంచి 2022 వరకూ ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో గత ఏడేండ్ల నుంచి దేశంలో నిరుద్యోగ రేటు 42.6 శాతంగా నమోదైంది. ఇక పని చేసే రంగంలో మహిళల శాతం పదేండ్ల క్రితం 26 శాతంగా ఉంటే… ఇప్పుడది 19 శాతానికి పడిపోవటం ఆందోళనకరం. కరోనాతో విలవిల్లాడిన భారత్‌కు ఈ నిరుద్యోగం మరింత శాపంగా మారింది. ఈ క్రమంలో ఈ యేడాది చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం.. నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన కాషాయ పరివారం… ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు ఒక్కటీ లేవు. పైగా అత్యంత కీలకమైన రక్షణ రంగంలోని కొలువులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అగ్నిపథ్‌ను తీసుకొచ్చి… యువతలో అగ్నికి ఆజ్యం పోశారు. జాబుల గురించి అడిగితే… ఊబర్‌, ఓలా, స్విగ్గీ, జొమోటాలు ఉన్నాయిగా..? ఆ పనులు చేసుకుని డబ్బులు సంపాదించండి, అవసరమైతే బజ్జీలేసుకుని బతకండంటూ ఉచిత సలహాలివ్వటం ‘బత్తాయి’లకు అలవాటైంది. ఇలాంటి అంశాలపై మన ‘మిత్రోన్‌’ నోరు మెదపరు. ఏ ఒక్క రోజూ స్పందించరు. అయినా మన పిచ్చిగానీ, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి, లాభాల్లో ఉన్న ఆయా కంపెనీలను తెగనమ్మి, అంబానీ, ఆదానీలకు అప్పనంగా లాభాలు చేకూర్చటమే పనిగా పెట్టుకున్న ప్రధానికి మన నిరుద్యోగుల ఆకలి కేకలు వినబడతాయనుకోవటం ఒట్టి భ్రమ.
ఇలాంటి వాస్తవాలను మరుగుపరుస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై దీక్ష చేస్తానంటే అది విడ్డూరం కాకపోతే మరేమిటి..? ఇదే సమయంలో ఘనత వహించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా తక్కువేం తినలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెడతామని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఆ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చారు. కానీ ఇప్పటి వరకూ దాని ఊసే లేదు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే అంటూ నానా హడావుడి, హంగామా చేసిన సర్కారు… ఆ సర్వేలో వచ్చిన వివరాలను మాత్రం ఇప్పటి వరకూ ప్రకటించకపోవటం గమనార్హం. ఆ విషయాన్ని పక్కకు పెడితే ఒక్కరోజులో అంతటి పెద్ద సర్వేను చేపట్టిన ప్రభుత్వానికి… ఈ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులున్నారు..? వారిని ఎన్ని కేటగిరీలుగా విభజించాలనేది పెద్ద సమస్యా..? కానే కాదు గదా? కానీ 2018 నుంచి ఇప్పటి వరకూ బీఆర్‌ఎస్‌ సర్కారు నిరుద్యోగులను లె..క్కి..స్తూ..నే ఉంది. మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా ఆ లెక్క ఇంకా తేలనే లేదు. ఇప్పుడు మళ్లీ నిరుద్యోగులను బుట్టలో వేసుకునేందుకు కేసీఆర్‌ సారు కొంగొత్త పథకాన్ని తెరమీదకు తెస్తున్నారని వినికిడి. ఇలా ఢిల్లీలో మోడీ, హైదరాబాద్‌లో కేసీఆర్‌… నిరుద్యోగులతో ఆటలాడుకోవటాన్ని మానుకోవాలి. లేదంటే ప్రజలే వారిద్దర్నీ రాబోయే రోజుల్లో రాజకీయ నిరుద్యోగులుగా మారుస్తారు.

Spread the love