కొవిన్ పోర్టల్ డేటా లీక్…

నవతెలంగాణ – హైదరాబాద్
దేశంలో అత్యంత ముఖ్యమైన డేటా లీకైంది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ కోసం కొవిన్ యాప్ ను రూపొందించిన విషయం తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసి వ్యక్తులు టీకా తీసుకున్నారు. ఈ యాప్ లో వ్యక్తుల పేర్లు, పాస్ పోర్ట్ వివరాలు, ఫోన్ నంబర్, ఆధార్ వివరాలు సహా పలు కీలకమైన సమాచారం ఉంటుంది. తాజాగా ఈ యాప్ నుంచి భారీ ఎత్తున డేటా లీకైంది. ప్రభుత్వ అధికారులతోపాటు, రాజకీయ నాయకుల పేర్లు, జర్నలిస్ట్ ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్, పాన్ తదితర వ్యక్తిగత వివరాలు టెలిగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి. కీలక సమాచారం మెసెంజర్ యాప్ లో సోమవారం ఉదయం కనిపించడంతో కలకలం రేపింది. ఎంతో గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారం లీక్ కావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీకైన డేటాలో కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తదితర ప్రముఖులు ఉన్నారు. డేటా లీకేజీపై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Spread the love