– ఎగువ కృష్ణ నుంచి రిజర్వాయర్‌లోకి ప్రవాహం
– ప్రతిరోజూ 7735 క్యూసెక్కుల నీరు
– వరద పెరిగితే ఆయకట్టుకు నీరు వదిలే అవకాశం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
జూరాలకు వరద ప్రవాహం మొదలైంది. ఎగువ కృష్ణ ప్రాంతం కర్నాటక, మహారాష్ట్ర నుంచి క్రమ క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. ప్రతి రోజూ 7735 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి చేరుతోంది. వరద ఉధృతి మరింత పెరిగి సగం వరకు నీటి మట్టం చేరితే ఆయకట్టుకు నీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. వారం రోజులుగా వాతావరణం చల్లబడటం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కరువడంతో ఖరీఫ్ సాగులో మెట్ట పంటలపై రైతులు దృష్టి సారించారు. అయితే, రిజర్వాయరులోకి నీరు వస్తే వరి సాగుపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కృష్ణానది ఎగువ ప్రాంతాన కురుస్తున్న వర్షాలకు జూరాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. వరదల వల్ల 1.5టీఎంసీల నుంచి నీటిమట్టం 2.495 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. రిజర్వాయరు మొత్తం నీటిమట్టం 9.647 టీఎంసీలు. ప్రతి రోజూ లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరితే.. వారం రోజుల్లో రిజర్వాయరు నిండుతుందని సాగునీటి అధికారులు చెబుతున్నారు. నీరు తక్కువగా వస్తుండటంతో స్పిల్‌వే, విద్యుత్, కాల్వలకు నీటిని వదలడం లేదు. ముఖ్యంగా బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు రిజర్వాయర్లకు నీరు వదలడం లేదు. కొంత మంది రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. బోరుబావులు, బావులు ఉన్న వారు నీటిని తోడి వరి సాగుకు సిద్ధమయ్యారు. పుష్కలంగా వరదలు వస్తే.. కెఎల్‌ఐ, జూరాలతోపాటు ఇతర ప్రాజెక్టుల కింద మొత్తం 8 లక్షల ఎకరాలు సాగవుతుంది. గత రబీలోనూ ఆశించిన స్థాయిలో సాగు నీరు అందలేదు. ఈసారి ముందస్తుగా వర్షాలు వస్తే.. వరితో పాటు ఆరుతడి పంటల సాగు కూడా పెరిగే అవకాశం ఉంది.