రాజ్‌నాథ్ సింగ్‌కు నాలుగు విష‌యాలు విజ్ఞ‌ప్తి చేశాం..కేటీఆర్

నవతెలంగాణ – న్యూఢిల్లీ: హైద‌రాబాద్‌లో స్కైవేలు, స్కై వాక్స్ కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరిన‌ట్లు రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్.. రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో దూసుకొని పోతున్న‌ద‌ని మేం చెప్పుకోవ‌డం కాదు.. కేంద్ర ప్ర‌భుత్వ‌మే చెప్తుంది అని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ అభివృద్ధి ప‌రంప‌ర కొన‌సాగే క్ర‌మంలో.. తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతూ, విస్త‌రిస్తూ జాతి నిర్మాణంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. కాబ‌ట్టి ఈ రాష్ట్రానికి చేయూత‌నివ్వండి, మ‌ద్ద‌తు ఇవ్వండి. తద్వారా జాతి నిర్మాణంలో మ‌రింత ఉధృతంగా పాల్గొనే అవ‌కాశం వ‌స్తుంది. భార‌త‌దేశానికి కూడా లాభం జ‌రుగుతుందనే మాటను కేంద్రానికి చాలాసార్లు చెప్పామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ ప్ర‌త్యేకంగా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసి ప్ర‌త్యేకంగా నాలుగు విష‌యాలు విజ్ఞ‌ప్తి చేయ‌డం జ‌రిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ లాంటి పెరుగుతున్న న‌గ‌రానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అందిన సాయం సున్నా. ఏ స‌హాయం రాలేదు. 2020 సంవ‌త్స‌రంలో హైద‌రాబాద్ న‌గ‌రం వ‌ర‌ద‌ల‌కు అత‌లాకుత‌ల‌మైతే ఒక్క పైసా కూడా స‌హాయం చేయ‌లేదు. మీరు స‌హాయం చేయ‌క‌పోతే చేయ‌క‌పోయారు కానీ.. క‌నీసం అభివృద్ధికి ఆటంక ప‌ర‌చ‌కండి. స్కైవేల నిర్మాణానికి ల్యాండ్ ఇస్తే.. మ‌రో ల్యాండ్ ఇస్తామ‌ని కూడా చెప్పాం. జేబీఎస్ నుంచి రాజీవ్ ర‌హ‌దారి వ‌ర‌కు స్కైవే నిర్మాణానికి 96 ఎక‌రాల ల్యాండ్ ఇవ్వ‌మ‌ని కోరాం. దానికి స‌మానంగా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి భూమిని కేటాయిస్తామ‌ని చెప్పాం. ప్యాట్నీ నుంచి నాగ్‌పూర్ హైవే వ‌ర‌కు 18.5 కిలోమీట‌ర్ల మేర స్కైవే నిర్మించాల‌ని అనుకుంటున్నాం. దాని కోసం 56 ఎక‌రాలు ఇవ్వాల‌ని కోరాం. దీనికి కూడా ల్యాండ్ ఫ‌ర్ ల్యాండ్ ఇస్తామ‌ని చెప్పాం. ఈ రెండు స్కైవేల‌కు డీపీఆర్ కూడా సిద్ధ‌మై ఉంది. కేంద్రం అనుమ‌తిస్తే హెచ్ఎండీఏ ఆధ్వ‌ర్యంలో వెంట‌నే ప‌నులు ప్రారంభిస్తాం అని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో స్కైవాక్స్ క‌డుతున్నాం. ఉప్ప‌ల్‌లో స్కైవాక్ పూర్త‌యింది. ఈ సోమ‌వారం ప్రారంభించ‌బోతున్నాం. మెహిదీప‌ట్నం రైతుబ‌జార్ వ‌ద్ద కూడా స్కైవాక్ క‌ట్ట‌బోతున్నాం. దుర‌దృష్టావ‌శాత్తు అక్క‌డ కూడా ర‌క్ష‌ణ శాఖ భూములు ఉన్నాయి. అక్క‌డ ఒక అర ఎక‌రం ల్యాండ్ కావాలి. దానికి కూడా ఇవ్వ‌ట్లేదు. ఆ స్థ‌లాన్ని వెంట‌నే ఇవ్వ‌మ‌ని కేంద్ర మంత్రిని కోర‌డం జ‌రిగింది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కొత్త‌గా పెద్ద ఎత్తున లింక్ రోడ్డులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 142 లింక్ రోడ్ల‌ను ప్లాన్ చేశాం. అందులో రెండు, మూడు కారిడార్ల‌కు సంబంధించి ర‌క్ష‌ణ శాఖ భూములు అడ్డు వ‌స్తున్నాయి. వాటికి కూడా అనుమ‌తివ్వండి అని కేంద్ర మంత్రికి ప్ర‌త్యేకంగా చెప్ప‌డం జ‌రిగింది. వీట‌న్నింటిని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి సానుకూలంగా ప‌రిశీలిస్తార‌ని ఆశిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Spread the love