ఎల్పీ నేతగా కేటీఆర్‌..?

ఎల్పీ నేతగా కేటీఆర్‌..?– ‘భవిష్యత్‌’ దృష్ట్యా సీఎం కేసీఆర్‌ యోచన
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది ఆయన వైపే మొగ్గు
– త్వరలోనే ఎల్పీ సమావేశం – శాసనసభాపక్ష నేత ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత(ఎల్పీ లీడర్‌)గా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నిక కాబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ భవన్‌ వర్గాలు. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్‌’ అవసరాల దృష్ట్యా కేటీఆర్‌కు అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ లీడర్‌గా అవకాశమివ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే అంశంపై ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులతో ఇప్పటికే చర్చించినట్టు తెలిసింది. వారందరూ కేసీఆర్‌ ప్రతిపాదనకు అంగీకరించినట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి…ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. దాంతో ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కింది. ‘ఈ కోణంలో’ ఆలోచించే కేటీఆర్‌ను బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా కేసీఆర్‌ నిర్ణయించినట్టు ఒక నేత తెలిపారు. ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావుకు ఎల్పీ లీడర్‌గా అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ… భవిష్యత్‌ కారణాల రీత్యా ఆయనకు ఆ అవకాశం రాకపోవచ్చని వినికిడి. ‘నూటికి నూరు శాతం కేటీఆరే శాసనసభాపక్ష నేత అవుతారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రావు. ఒకవేళ వస్తే… కేటీఆర్‌, హరీశ్‌ కాకుండా ఇంకెవరికైనా సీనియర్‌కు ఆ పదవి దక్కే అవకాశం ఉండొచ్చు…’ అని ఒక కీలక నాయకుడు వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌ ఎల్పీ లీడర్‌ అయితే.. మరి కేసీఆర్‌ ఏం చేస్తారు..? అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. దానికి ‘ఉద్యమ నాయకుడిగా, పదేండ్ల నుంచి సీఎంగా ఉన్న కేసీఆర్‌, ఇప్పుడు సాధారణ ఎల్పీ లీడర్‌గా ఉండకపోవచ్చు. అసెంబ్లీకి కూడా రాకపోవచ్చు…’ అనే సమాధానం వినిపిస్తోంది. మరోవైపు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి, ఢిల్లీకి వెళ్లిపోవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ అంటే మొదటి నుంచి కేసీఆర్‌కు పడదు. ఆయన ముఖం కూడా చూడటానికి మాజీ సీఎం ఇష్టపడరనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాల రీత్యా కూడా కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోవచ్చనీ, అందుకే కేటీఆర్‌ను రంగంలోకి దించబోతున్నారనే వ్యాఖ్యలూ వినబడుతున్నాయి. త్వరలో నిర్వహించబోయే బీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష సమావేశంలో ఇందుకు సంబంధించి పూర్తి స్పష్టత రానుంది.

Spread the love