– జహీరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
– త్వరలో రీజినల్ రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ-జహీరాబాద్
”వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి చేయించిన, చేసిన నిందితులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వత్తాసు పలకడం ఏమిటి? ఆయన ఏం చేస్తున్నారో.. ఆయనకే తెలియడం లేదు.. కలెక్టర్ దాడికి కుట్ర పన్నిన రౌడీషీటర్ తమ వాడేనని చెప్పుకోవడం సిగ్గుచేటు” అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. షోలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తూ మార్గమధ్యలో గురువారం జహీరాబాద్‌లో ఆగారు. జడ్చర్ల ఎమ్మెల్యే వంశీధర్ రెడ్డి, సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉజ్వల్‌రెడ్డితో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక రౌడీషీటర్ కలెక్టర్, అధికారులపై దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన వారు తమ పార్టీ కార్యకర్తలేనంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడి పోవటం వల్లనే బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున బాగా వెనుక బడ్డాయని, వీటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. రోడ్లు బాగుంటేనే దేశం బాగు పడుతుందన్నారు. గత పాలకులు దీనిపై దృష్టి పెట్టలేదన్నారు. కూలిపోయే కాళేశ్వరం, నీళ్లు రాని మిషన్ భగీరథను కమీషన్ల కోసం ఏర్పాటు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మూసీ మురికిని తొలగిస్తున్నామని, ఎవరు అడ్డొచ్చినా ఆగదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు చెంపదెబ్బకొట్టినా ఇంకా కనువిప్పు కలగలేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నందున రీజినల్ అవుటర్ రింగ్ రోడ్డు శంకుస్థాపనలో జాప్యం జరిగిందని, ఎన్నికలు అయిన వెంటనే ప్రధాని మోడీని ఆహ్వానించి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.
చిరాకుపల్లి నుంచి మన్నాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. జహీరాబాద్ నుంచి ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 32 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. అసద్గంజ్ నుంచి కాసింపూర్ మీదుగా రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో సుమారు రూ.6 కోట్లతో అతిథి గృహ నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, రామలింగారెడ్డి, సీడీసీ చైర్మెన్ మహమ్మద్ ముబీన్, శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, అత్తర్ గౌరీ, హర్షవర్ధన్ రెడ్డి, రాములు నేత, జహంగీర్, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.